కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు, రికార్డు సృష్టించడానికి ఏదీ అడ్డంకి కాదంటున్నాడు కర్ణాటకకు చెందిన దర్శన్. అంతా బియ్యపు గింజపై బొమ్మలు వేస్తున్నారు, అక్షరాలు రాస్తున్నారు. అందుకే ఇతడు వెరైటీగా ఆలోచించాడు. సిగరెట్ తో సంచలనం సృష్టించాడు.
కర్ణాటకలోని చెన్నపట్నం తాలూకాకు చెందిన దర్శన్ గౌడ, కాస్త కొత్తగా ఆలోచించాడు. సిగరెట్ గా ఏకంగా 7186 అక్షరాలు రాశాడు. 5 నిమిషాల్లో తాగి పడేసే సిగరెట్ పై ఇలా వేలకొద్దీ అక్షరాలను నింపేసి రికార్డ్ సృష్టించాడు ఈ యువకుడు.
ఇంతకీ ఈ సిగరెట్ పై అతడు ఏం రాశాడో తెలుసా? ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని పదేపదే రాశాడు. 260 సార్లు ఈ వాక్యాన్ని సిగరెట్ పై రాశాడు. అక్కడితో ఆగలేదు. అదే సిగరెట్ పై 80సార్లు ఇండియా అని రాశాడు. ఇలా 6.9 సెంటీమీటర్ల సిగరెట్ పై 7186 అక్షరాల్ని లిఖించాడు.
కేవలం సామాజిక సందేశాన్నిచ్చేందుకే తను ఈ పని చేసినట్టు, రికార్డు కోసం కాదని అంటున్నాడు దర్శన్. యూత్ ఎక్కువగా సిగరెట్లకు బానిస అవుతోందని, వాళ్లను సిగరెట్ మాన్పించేలా చేయడమే తన ఉద్దేశమని, అందుకే సిగరెట్ తో ఈ ఫీట్ సాధించానని చెప్పుకొచ్చాడు.
ఈ పనితో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు ఈ యువకుడు. దీంతో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కాడు.