ఖర్గే క్లారిటీ: కాడి మోసింది ఇక చాలు!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యవహార సరళిలో వైరాగ్యం వచ్చిందా..? ఇన్నాళ్లు నిర్వహించిన పార్టీ సారథ్యంతో ఆయన విసిగి వేసారి పోయారా? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే ఆశలు సన్నగిల్లి.. ఈ…

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యవహార సరళిలో వైరాగ్యం వచ్చిందా..? ఇన్నాళ్లు నిర్వహించిన పార్టీ సారథ్యంతో ఆయన విసిగి వేసారి పోయారా? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే ఆశలు సన్నగిల్లి.. ఈ వయసులో ఇంకా రాజకీయ భారం మోస్తూ కష్టాలు పడడం అనవసరం అని భావిస్తున్నారా? అనే అభిప్రాయాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఎన్నికల పర్వం పూర్తయిపోతోంది. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అవసరమైన సంకేతాలు ఇస్తాయి.. మరో రెండు రోజుల తర్వాత ఫలితాలు కూడా వచ్చేస్తాయి.

కాంగ్రెస్ పార్టీలో ఏ మేరకు ఆశలు ఉన్నాయో తెలియదు గానీ.. ఇండియా కూటమి తరఫున ఇప్పటిదాకా ప్రధాని పదవికి నలుగురి నడుమ బహిరంగంగా వినిపించిన ఒకే ఒక్క పేరు మల్లికార్జున ఖర్గే. అయితే ఈ సమయంలో మిన్నకుండిపోయిన ఆయన మాత్రం, ఇప్పుడు ప్రధాని పదవికి తన ఓటు రాహుల్ కు మాత్రమేనని చెబుతున్నారు.

మల్లికార్జున ఖర్గే ప్రధాని పదవిని త్యాగం చేస్తున్నారా.. లేదా, ఎటూ అది దక్కేది కాదు గనుక ముందుగానే త్యాగం చేస్తున్నట్లుగా లౌక్యం ప్రదర్శిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా ఉంది.

గతంలో ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ప్రొజెక్టు చేస్తూ ఇండియా కూటమి ఎన్నికలకు వెళ్లాలనే విషయం నిర్ణయించడానికి భాగస్వామి పార్టీల సమావేశం జరిగింది. అందులో దాదాపు ఏకగ్రీవంగా మల్లికార్జున ఖర్గే పేరునే ప్రతిపాదించారు. అయితే ఆ సమావేశం ముగిసిన తర్వాత కూడా.. అలాంటి ప్రకటన మాత్రం రాలేదు. ఖర్గేనే స్వయంగా కూటమి పార్టీలను బతిమాలి.. ప్రకటన రాకుండా ఆపినట్లు వార్తలు వచ్చాయి.

తీరా ఇప్పుడు చివరి విడత పోలింగ్ కూడా ముగుస్తున్న సమయంలో ఖర్గే, ప్రధానిగా ఇండియా కూటమి తరఫున రాహుల్ పేరును తెరపైకి తెస్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు రెండు భారత్ జోడో యాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చారు గనుక.. ఆయనే కరెక్టు అని అంటున్నారు.

అంతా బాగానే ఉంది గానీ.. వలచి వచ్చిన ప్రధాని పదవిని మల్లికార్జున ఖర్గే వద్దనుకుంటున్న తీరును గమనిస్తే.. ఇండియా కూటమి గెలుస్తుందనే నమ్మకం ఏఐసీసీ అధినేతలో లేదేమో అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.