అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల పోలింగ్ రోజున అట్టుడికింది. ప్రధానంగా తాడిపత్రి టౌన్లోనే ఆ రోజున విపరీతమైన రచ్చ జరిగింది. పల్లెల్లో ప్రశాంతంగానే పోలింగ్ పూర్తి అయినా, తాడిపత్రి టౌన్లో మాత్రం విపరీతమైన రచ్చ జరిగింది. తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ నాడు రాజుకున్న రచ్చకు సంబంధించి సంచలన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
శాంతిభద్రతల నియంత్రణలో ఉన్న కేంద్ర బలగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి బయట సీసీ కెమెరాలను పగలకొడుతున్న వీడియోలు దుమారం రేపాయి! పోలీసులు తమ చేతుల్లోని లాఠీలతో అలా ఎమ్మెల్యే ఇంటి సీసీ కెమెరాలు పగల గొట్టడం ఏమిటనే సందేహం కలుగుతుంది ఆ వీడియోలను వీక్షిస్తే! మరి పోలీసులు ఎందుకు అలా సీసీ కెమెరాలను పగలగొట్టాల్సి వచ్చిందో నివృత్తి చేసే వాళ్లు లేకుండా పోయారు! పోలింగ్ వేళ రాజకీయ పార్టీల నేతల అనుచరులు చేసే హడావుడి సంగతెలా ఉన్నా, అలా పోలీసులు సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన అంశం!
ఆ సంగతలా ఉంటే.. తాడిపత్రిలో పోలింగ్ రోజున రచ్చ చేసిన వారిపై కేసులు అయితే గట్టిగా నమోదు అయినట్టుగా ఉన్నాయి. వందమందికి పైనే కేసులను పెట్టారు పోలీసులు, చాలా మందిపై రౌడీ షీట్ లను ఓపెన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. కేసులే కాదు, ఆ రోజు రచ్చ చేసిన వారిని గుర్తించి, పోలీసులు దొరికిన వాళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లి తాట తీశారనే టాక్ కూడా వస్తోంది. రచ్చల్లో పాల్గొన్న వారిలో దొరికిన వారికి పోలీసులు తమ మర్యాదలు చేశారని, విపరీతంగొ కొట్టారని సమాచారం! దొరికిన వాళ్లకు కండలు పగిలేలా పోలీసులు కొట్టారనే మాట వినిపిస్తూ ఉంది.
ఇలా కొందరు దొరకడం వారికి పోలీసులు తమమార్కు ట్రీట్ మెంట్ ఇవ్వడంలో మిగతా వారు అలర్ట్ అయ్యారట! అల్లర్లకు పాల్పడిన వారు పోలీసుల తీరును గమనించి తలా ఒక దిక్కున పారిపోయినట్టుగా భోగట్టా, దొరికిన వారిని పోలీసులు తురుముతున్నారనే సమచారం అందుకుని, అల్లర్లు చేసిన వారిలో కొందరు పరారీ అయ్యారట, జిల్లాను విడిచి, ఊర్లను, పల్లెలను వదిలి దూర ప్రాంతాల్లో వీరు తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్నికల కేసులు కావడం, ఫలితాల వెల్లడికి గ్యాప్ రావడంతో .. ఈ లోపు పోలీసులు తమతో ఆటాడుకుంటారనే లెక్కలతో వీరు పరారీ అయినట్టుగా సమాచారం. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే వీరు సొంతూళ్ల వైపు చూసే అవకాశాలున్నాయి! అయితే అక్కడా ఒక మెలిక ఉంది, అల్లర్లకు పాల్పడి పారిపోయారు, రేపు వీరు మద్దతుగా నిలిచే పార్టీ అధికారంలోకి రాకపోతే.. అప్పుడు వీరి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.
ఎవరు ఎంత రచ్చ చేశారో వీడియోలకు ఎక్కింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, అది పూర్తయ్యాకా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, వారి ప్రత్యర్థులకు పోలీసులు, రాజకీయ నేతల నుంచి పాట్లు తప్పకపోవచ్చు! తాడిపత్రిలో డైరెక్టుగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల మీదకే దాడులు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డి ఇంటిపై అటాకే జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.. అభ్యర్థులు తమ సమయం కోసం వేచి చూస్తూ ఉండవచ్చు!
అయితే ఈ అల్లర్లు చేసింది ఏ పార్టీ వాళ్లు అయినా.. వారికి వ్యక్తిగతంగా ఒరిగేదేమీ కూడా పెద్దగా ఉండదు! అల్లర్లు చేసిన వారెవరినీ ఎమ్మెల్యేగా ఎవరు నెగ్గినా వారు పొత్తిళ్లలో ఏమీ దాచుకోరు! మహా అంటే చిన్న చిన్న పనులు కేటాయిస్తారేమో! వాటికి ఆశపడి, పొలిటికల్ రౌడీయిజం చూపించాలనే వీరావేశంతో యువత కూడా అక్కడ తమ జీవితాలను పాడుచేసుకుంటోంది. ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అయ్యిందంటే.. ఆ తర్వాత మీకు జీవితం మీదే విరక్తి వస్తుందని పోలీసులే హెచ్చరిస్తున్నారు. అలాంటిది ఎన్నికల కేసులంటే అవేమీ తేలిక కాదు! అయితే నేతల రెచ్చగొట్టు ధోరణితో ఇలాంటి ఉచ్చులో చాలా మందే చిక్కుకున్నారు.
తాడిపత్రి ఉదాహరణనే తీసుకున్నా.. అభ్యర్థులు ఇద్దరూ పోలింగ్ పూర్తయ్యాకా తమ ఫ్యామిలీలతో ప్రశాంతంగా ఉన్నారు, రచ్చలు చేసిన వారు మాత్రం ఇప్పుడు తలోదిక్కూ చూసుకున్నట్టు గా ఉన్నారు. దొరికిన వారు పోలీసులతో చావుదెబ్బలు తింటున్నారు!