ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే ఫలితాలు చంద్రబాబు, వైఎస్ జగన్ భవిష్యత్ తేలుస్తాయి. మారిన రాజకీయ స్వభావ రీత్యా ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన, అంతా తలకిందులవుతుందనే భయం వుండేది కాదు.
కానీ ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ రాజకీయ వాతావరణం పూర్తిగా మార్పు చెందింది. ఎన్నికల్లో ఓడిపోవడం అంటే… రాజకీయ ఉనికి కోల్పోవడమే అనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా తెలంగాణలో బీఆర్ఎస్‌ను చూస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు కేసీఆర్ ఏకచ్చత్రాధిపత్యంగా పరిపాలించారు.
తనకు తిరిగేలేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాలం గిర్రున తిరిగి… కేసీఆర్‌ను ఓడించింది. అధికారం రుచి మరిగిన రాజకీయ నాయకులు, అది లేనిదే కునుకు తీయడం లేదు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్‌కు నీడలా నడుచుకున్న నాయకులు, నేడు రేవంత్‌రెడ్డి పంచన చేరారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు.
తాజాగా ఎంపీ ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశం వుందంటున్నారు. కేసీఆర్‌పై ద్వేషం లేదా రేవంత్‌రెడ్డిపై ప్రేమతోనో వాళ్లంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని అనుకుంటే పొరపాటే. అందరికీ అధికారంపై మోజు. రేపు కాంగ్రెస్ అధికారం కోల్పోయి, బీజేపీ వచ్చిందంటే…అంతా పోలోమని చేరిపోతారు.
ఈ అనుభవాల దృష్ట్యా ఏపీలో ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. వైసీపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటే. ఇక టీడీపీని మరిచిపోవాల్సిందే. చంద్రబాబు వయసు పైబడడం, ఆయన వారసుడైన లోకేశ్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడం తదితర కారణాల రీత్యా… టీడీపీకి భవిష్యత్ వుంటుందని అనుకోలేం. ఇప్పటికే టీడీపీలో ఒక చర్చ వుంది.
ఈ దపా అధికారంలోకి వస్తే సరేసరి. లేదంటే పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సి వస్తుందనే చర్చ టీడీపీలో జరుగుతోంది. కూటమి అధికారంలోకి రాకపోతే, టీడీపీకి సంబంధించి జరగబోయేది ఇదే.
కూటమి అధికారంలోకి వస్తే, వైసీపీకి ముప్పుతిప్పలు తప్పవు. వైసీపీ అధికారంలోకి రాకపోతే, జగన్ వెంట ఎంత మంది వుంటారో ఎవరూ చెప్పలేరు. వైసీపీ, జగన్ వుంటారు. అయితే వారి వెంట వుండేవాళ్లు ఎందరన్నదే ప్రశ్న. బాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల రీత్యా… ఈ దఫా బీజేపీ అండ చూసుకుని టీడీపీ మరింత చెలరేగిపోనుంది.
అధికారం చేతిలో వుంటే, బాబు, లోకేశ్ ఆకాశమే హద్దుగా వేధిస్తారనడంలో సందేహం లేదు. వారి వేధింపులను వైసీపీ నేతలు ఏ మేరకు తట్టుకోగలరన్నదే ప్రశ్న. జగన్ కోసం ఇబ్బందులు తెచ్చుకుంటారని అనుకోవడం భ్రమే. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు ఇటు జగన్, అటు చంద్రబాబుకు అత్యంత అవసరం.
గెలిచిన వాళ్లు ప్రత్యర్థుల్ని వేటాడి రాజకీయ ఉనికే లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓడిన వాళ్లు మళ్లీ ఎన్నికల వరకూ పార్టీని, నాయకులు, అనుచరులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై దృష్టి సారిస్తారు. ఏది ఏమైనా వేధింపుల రాజకీయాల్ని కోరి తెచ్చుకున్న నాయకులు… తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో శత్రుత్వాలను పెంచుకోవడం వల్ల ఏర్పడిన దుర్మార్గ వ్యవస్థ నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు.