పల్నాడు జిల్లాలో అత్యంత వివాదాస్పదంగా మారిన సీఐని ఎన్నికల సంఘం తప్పించింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని ఎట్టకేలకు విధుల నుంచి ఈసీ తొలగిస్తూ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. మాచర్లలో ప్రధానంగా గొడవలు జరగడానికి కారంపూడి సీఐ వ్యవహార శైలే కారణమనే విమర్శలు బలంగా ఉన్నాయి.
చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామి టీడీపీ కార్యకర్తలా ఎన్నికల్లో పని చేశారని వైసీపీ ఘాటు విమర్శలు చేసింది. అంతేకాదు, తనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది కూడా ఈ సీఐ నారాయణస్వామే. వైసీపీకి పట్టున్న గ్రామాల్లో వారిపై అణచివేత చర్యలకు పాల్పడి, టీడీపీ అనుకూల గ్రామాల్లో యథేచ్ఛగ్గా గొడవలు చేసేందుకు నారాయణస్వామి సహకరించారని ఆధారాలతో సహా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.
కౌంటింగ్ సమయంలో వివాదాస్పద సీఐ విధుల్లో వుంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే సీఐపై హైకోర్టులో విచారణ నడుస్తున్న సంగతి తెలిసిందే. కారంపూడి సర్కిల్లో నారాయణస్వామి విధుల్లో వుంటే, కౌంటింగ్, ఆ తర్వాత కూడా గొడవలు చెలరేగే ప్రమాదం వుందని ఈసీ దృష్టికి వైసీపీ తీసుకెళ్లడంతో, విచారణ జరిగింది.
వైసీపీ వినతి మేరకు నారాయణస్వామిని విధుల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. అలాగే టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వైసీపీ అనుకూల అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది.