ఇవాళ దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సుదీర్ఘ సమయం తీసుకోవడం వెనుక భారీ కుట్ర వుందని ఇండియా కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం ఏడు విడతల్లో, అది కూడా ఎక్కువ సమయాన్ని తీసుకున్నారని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చర్చించేందుకు టీవీ డిబేట్లకు వెళ్లకూడదని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై బీజేపీ సెటైర్స్ విసురుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.
“ఎన్నికల్లో భారీ ఓటమి గురించి కాంగ్రెస్‌కు ముందే తెలుసు. మీడియా, ప్రజలకు ఏ రకంగా ముఖం చూపిస్తారు? అందుకే ఎగ్జిట్ పోల్స్‌కు దూరంగా కాంగ్రెస్ పార్టీ పారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ పారిపోవద్దు. ఓటమిని ఎదుర్కొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పదలుచుకున్నా” అని అమిత్‌షా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఎగ్జిట్ పోల్స్‌పై ఏపీలో తన మిత్రపక్షమైన టీడీపీ కూడా కాంగ్రెస్ రీతిలోనే స్పందించిన సంగతి అమిత్‌షాకు తెలియనట్టుంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వుంటాయనే ఉద్దేశంతో బీజేపీ సంబరం చేసుకుంటోంది. మరోవైపు ఏపీలో మాత్రం… టీడీపీ, ఆ పార్టీని భుజాన మోసే ఎల్లో మీడియా మాత్రం, అవన్నీ తప్పని అంటున్నాయి.