బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు సంబంధించి సీబీఐ మరో కీలక విషయన్ని వెల్లడించింది. 2015-16 మధ్య మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో రూ.330కోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు తెలిపింది.
ముంబయిలో సీబీఐ తాజాగా సమర్పించిన సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌లో గత ఛార్జ్‌షీట్లో ఉన్న 11 మంది నిందితుల పేర్లతో పాటు ఐడీబీఐ బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును కూడా చేర్చింది. 2009 అక్టోబర్‌లో 150 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణం (ఎస్‌టిఎల్) మంజూరు విషయంలో దాస్‌గుప్తా తన అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఐడిబిఐ బ్యాంక్ మరియు విజయ్ మాల్యా అధికారులతో కలిసి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
కాగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసమని 17 బ్యాంకుల నుంచి రూ.9వేల కోట్లు అప్పు చేసిన మాల్యా… 2016లో విదేశాలకు పరారయ్యరు. విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాల్యా తీసుకున్న రుణాలు చెల్లించడంలో కోర్టు ఆదేశాలను అనుసరించడం లేదని సుప్రీం కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ మాల్యా కూడా ఆయన ఆస్తులను వెల్లడించకుండా.. వాటిని పిల్లల పేరుపైకి బదిలీ చేశారు.