బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ లో సులభ్ కాంప్లెక్స్ వాడినప్పుడు కనీస ఛార్జీ ఉంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం టాయిలెట్ కు వెళ్లి దాదాపు 6వేల రూపాయలు ఖర్చు చేసినట్టయింది. వందే భారత్ ట్రైన్ లో టాయిలెట్ కు వెళ్లడమే అతడు చేసిన తప్పు.
హైదరాబాద్ కు చెందిన అబ్దుల్, డ్రై ఫ్రూట్ బిజినెస్ చేస్తుంటాడు. అతడికి హైదరాబాద్ లో ఒకటి, మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో 2 షాపులున్నాయి. తన స్వస్థలం వెళ్లేందుకు కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరి భోపాల్ చేరుకున్నాడు అబ్దుల్.
భోపాల్ రైల్వే స్టేషన్ లో మూత్ర విసర్జన చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఫ్లాట్ ఫామ్ పైకి వందేభారత్ వచ్చి ఆగింది. అందులో టాయిలెట్స్ బాగుంటాయని తెలుసుకున్న అబ్దుల్, వందేభారత్ ఎక్కాడు. తన పని ముగించుకున్నాడు. కానీ బయటకొచ్చి చూసేసరికి డోర్స్ మూసుకుపోయాయి. ఆ వెంటనే ట్రయిన్ కదిలింది.
విషయం తెలుసుకున్న టికెట్ కలెక్టర్ అబ్దుల్ కు 1020 రూపాయల జరిమానా వేశాడు. అది చెల్లించిన అబ్దుల్, ఉజ్జయినిలో వందేభారత్ దిగాడు. అబ్దుల్ కోసం ఎదురుచూస్తూ, భోపాల్ రైల్వే స్టేషన్ లోనే భార్యాపిల్లలు ఉండిపోయారు. దీంతో 750 రూపాయలు చెల్లించి, బస్సు ఎక్కి తిరిగి భోపాల్ చేరుకున్నాడు.
ఈ క్రమంలో భోపాల్ నుంచి సింగ్రౌలీ కి ఎక్కాల్సిన ట్రైన్ ను వాళ్లు మిస్సయ్యారు. ఆ టికెట్ల ఖరీదు అటుఇటుగా 4వేల రూపాయలు. అలా మొత్తంగా 6వేల రూపాయల వరకు నష్టపోయాడు అబ్దుల్. మూత్ర విసర్జన కోసం వందేభారత్ ఎక్కినందుకు అతడు చెల్లించుకున్న మూల్యం ఇది.
గతంలో ఏపీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వందేభారత్ ను ప్రవేశపెట్టిన కొత్తలో సెల్ఫీ దిగేందుకు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ట్రయిన్ ఎక్కాడు ఓ వ్యక్తి. డోర్స్ మూసుకుపోవడంతో విజయవాడలో దిగాడు. జరిమానాతో పాటు, బస్సు ఛార్జీలు కలుపుకొని, అతడికి బాగానే డబ్బులు ఖర్చయ్యాయి.