Advertisement

Advertisement


Home > Politics - National

‘మేఘా’ మేతలో అందరూ అందరే!

‘మేఘా’ మేతలో అందరూ అందరే!

సుప్రీం కోర్టు కత్తి ఝుళిపించిన పర్యవసానంగా.. రాజకీయ పార్టీల అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో రాజకీయ పార్టీలు ఎంతకంత సన్నిహితంగా అంటకాగుతూ ఉంటాయో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోగల సందర్భం ఇది.

ఇతర విరాళాలు, లంచాలు, వ్యక్తిగతంగా నగదుగా దఖలు పరచుకునే అక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఎన్నికల బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు ముట్టజెప్పిన చందాల వివరాలు పూర్తిస్థాయిలో వెలుగుచూశాయి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు మేఘా ఇంజినీరింగ్ సంస్థ విరాళాలు ఒక సంచలనం. ఈ సంస్థ ముట్టజెప్పిన ఆమ్యామ్యాలను పుచ్చుకోవడంలో పార్టీలు అందరూ అందరే. పరిశుద్ధాత్మ స్వరూపులు, ఏ మరకా అంటని వారూ ఎవ్వరూ లేకపోవడం గమనార్హం.

దేశంలోనే దాదాపు 11వేల కోట్ల పైచిలుకు సొమ్ములు పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో అందాయి. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అనే సంస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలకూ విరాళాలు ఇచ్చుకుంది. ఈ ఒక్క సంస్థ 1368 కోట్ల విలువైన బాండ్లను కొన్నది. వారి తర్వాత అత్యధికంగా 966 కోట్ల విరాళాలను పార్టీలకు ముట్టజెప్పిన అతిపెద్ద సంస్థ మేఘా ఇంజినీరింగ్! ఈ సంస్థ తెలుగువారిదే కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా అనేక కాంట్రాక్టులు చేస్తూ ఉండే మేఘా.. ఒక్క భారతీయ జనతా పార్టీకే రూ.584 కోట్ల విరాళాలు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ కు వారు ఇచ్చింది కేవలం 17 కోట్లే. కానీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను మంచిగానే గమనించుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ కు 37 కోట్లు, తెలుగుదేశానికి 25 కోట్లు ముట్టజెప్పారు. 5నుంచి 10 కోట్ల వరకు మేఘా నుంచి విరాళం పొందిన పార్టీలో జేడీయూ, జేడీఎస్ లతో పాటూ సినిమాల్లో సంపాదనను త్యాగం చేసి, ఇంటిఖర్చులకు కూడా వాడుకోకుండా పార్టీకోసం ఖర్చు పెడుతున్నానని డాంబికంగా పలికే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. మేఘా నుంచి వసూలు చేసిన ప్రాంతీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితిదే రికార్డు. వారికి ఏకంగా 195 కోట్లు ముట్టజెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం సహా అనేక ప్రాజెక్టులను మేఘా సంస్థకు కట్టబెట్టారనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి వ్యవహారాలు అడ్డదారుల్లో జరిగాయని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే.. మేఘా సంస్థ ప్రతి రాజకీయ పార్టీకి కూడా రాజపోషకుడిలాగా నిలుస్తోంది. ప్రతి పార్టీని పోషిస్తోంది. బహుశా అధికారంలో ఎవ్వరున్నా వారికి మేలు చేయడానికే పనిచేస్తారేమో అనిపించేలా పరిస్థితి మారుతోంది.

ఈ ఎన్నికల బాండ్ల వ్యవహారం ప్రజల కళ్లు తెరిపించాలి. తమ ఎదుట నిలబడి నీతులు ప్రవచించే రాజకీయనాయకులు పరిశుద్ధులేమీ కాదనే క్లారిటీ వారికి ఉంటే.. వారు తీసుకునే నిర్ణయాల్లో మార్పు రావొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?