Advertisement

Advertisement


Home > Politics - National

క‌ర్ణాట‌క‌లోనూ ఎంఐఎం!

క‌ర్ణాట‌క‌లోనూ ఎంఐఎం!

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ తిరుగులేని రీతిన అధికారాన్ని కొన‌సాగిస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయంగా త‌న ప‌లుకుబ‌డిని, త‌న ఉనికిని బాగా పెంచుకుంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఎంఐఎం. 2014కు ముందు ఎంఐఎం అంటే పాత బ‌స్తీ పార్టీ మాత్ర‌మే! 

అయితే ఎంఐఎంకు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపును ద‌క్కింది మాత్రం కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ తిరుగులేని రీతిన అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే! దానికి కార‌ణాల గురించి విశ్లేషించ‌డం మొద‌లుపెడితే పెద్ద క‌థే అవుతుంది కానీ..  ఎంఐఎం ఎక్క‌డ అడుగుపెట్టినా మేలు జ‌రిగేది మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి అని స్ప‌ష్టం అవుతోంది.

మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బిహార్.. ఇలా  పొలిటిక‌ల్ ట‌గ్ గ‌ట్టిగా ఉన్న చోట‌ల్లా ఎంఐఎం చాప‌కింద నీరులా చేరుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌న్ని రోజులూ.. ఆ పార్టీ చంక‌లో ఉన్న‌ట్టుగా క‌నిపించిన ఒవైసీ ఈ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తూ పోటీకి దిగారు. ఎంఐఎం రంగంలోకి దిగ‌డంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్ చేజార‌డ‌మే కాదు, హిందూ ఓట్ల ఏకీకృతానికి కూడా మార్గం సుగ‌మం అవుతోంద‌నేది ప్ర‌ముఖంగా వినిపించే విశ్లేష‌ణ‌.

ఈ క్ర‌మంలో ఎంఐఎం మ‌రో రాష్ట్రంలో పోటీకి రంగం సిద్దం చేసుకుంటోంది. అది క‌ర్ణాట‌క‌లో. దాదాపు 20 సీట్ల‌ను గుర్తించి, వాటిల్లో క‌స‌ర‌త్తు చేస్తోంద‌ట ఎంఐఎం. ముస్లిం జ‌నాభా గ‌ట్టిగా ఉన్న 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంఐఎం త‌న అభ్య‌ర్థుల‌ను పోటీలోకి దించి పోరాడుతుంద‌ట‌. గ‌తంలో కూడా ఎంఐఎం క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేసింది. అది అదంత సీరియ‌స్ గా కాదు. జేడీఎస్ తో కూడా ఈ పార్టీకి స్నేహం ఉండేది.

అయితే ఇప్పుడు లెక్క‌లు మారిన‌ట్టుగా ఉన్నాయి. ఎంఐఎం సొంతంగా 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి త‌న స‌త్తా  చాటుకుంటుంద‌ట‌! ఇలా ఎంఐఎం ప్ర‌క‌ట‌న రావ‌డంతోనే.. ఇది కాంగ్రెస్ కు గ‌ట్టి దేబ్బే అవుతుందంటూ క‌ర్ణాట‌క రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏ పార్టీ అధికారానికి చేరువైనా.. మెజారిటీకి ఐదు ప‌ది సీట్లు.. అటూ ఇటూ అన్న‌ట్టుగా ఉండే క‌ర్ణాట‌క‌లో ఎంఐఎం ఎలాంటి ప్ర‌భావాన్ని చూప‌బోతోందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?