ప్రపంచంలో ఏ దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారో తెలుసుకున్నాం. ఇందులో మన ఇండియా స్థానం కూడా తెలిసిందే. మరి ఇండియాలో ఏ రాష్ట్రం సంతోషంగా ఉంది? ఏ రాష్ట్రంలో ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. దీనికి ఇప్పుడు సమాధానం దొరికింది.
భారత్ లో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ ఆశావహ దృక్పథంతో, ఆనందంతో ఉన్నారంట. గురుగ్రామ్ లోని మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంతకీ వీళ్లు ఇంత సంతోషంగా ఉండడానికి కారణాలేంటి? సర్వేలో ఆ అంశాల్ని కూడా వెల్లడించారు. కుటుంబం, బంధాలు, పని ప్రదేశాలు, సామాజిక అంశాలు, ధాతృత్వం, కులమతాలు, కరోనా తర్వాత జీవితం అనే 6 అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సర్వే నిర్వహించారు. ఈ అంశాలన్నింటిలో మిజోరం బెస్ట్ గా నిలిచింది.
మిజోరంలో లింగభేదం లేకుండా అందరూ 16-17 సంవత్సరాలకే ఆర్జిస్తున్నారు. అలా ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతున్నారట. ఇక పాఠశాలల్లో కూడా పిల్లలపై ఒత్తిడి తక్కువగా ఉందంట. తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య సమావేశాలు కూడా తరచుగా జరుగుతున్నాయట. ఇక విద్యార్థులు కూడా ఉపాధ్యాయులతో చాలా ఫ్రీగా ఉంటున్నారట.
కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైనప్పటికీ, పిల్లల్ని పెంచడంలో తండ్రి లేదా తల్లి పూర్తి పరిణతి చూపిస్తున్నారట. ఇక అన్నింటికంటే ముఖ్యమైన అంశం కులం-మతం. ఈ రెండు విషయాల్ని మిజోరం ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారట. ఎదుటి వ్యక్తిని ఈ కోణంలో చూసే ప్రజలు మిజోరంలోనే తక్కువగా ఉన్నారంట. ఇక ఆడ-మగ అనే బేధ భావం కూడా మిజోరంలో తక్కువగా ఉందంట.
వీటితో పాటు కరోనా దుష్ప్రభావాల నుంచి త్వరగా బయటపడ్డారట మిజోరం ప్రజలు. ఈ కారణాలన్నింటి వల్ల మిజోరం ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని సదరు సర్వేలో తేలింది.