చైతూతో ఎప్పటికైనా సినిమా

నాంది సినిమా తరువాత నాగ్ చైతన్యతో కొన్నాళ్లు ట్రావెల్ చేసిన మాట వాస్తవం అని, అయితే అనుకున్న కథ క్లయిమాక్స్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ జర్నీ అలా ఆగిందని దర్శకుడు విజయ్…

నాంది సినిమా తరువాత నాగ్ చైతన్యతో కొన్నాళ్లు ట్రావెల్ చేసిన మాట వాస్తవం అని, అయితే అనుకున్న కథ క్లయిమాక్స్ విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, ఆ జర్నీ అలా ఆగిందని దర్శకుడు విజయ్ అన్నారు. 

నాంది సినిమాతో మాంచి హిట్ కొట్టిన విజయ్ తన తరువాత సినిమాగా ఉగ్రం అందిస్తున్నారు. అల్లరి నరేష్ హీరో, సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమా మే అయిదున విడుదల అవుతున్న నేపథ్యంలో గ్రేట్ ఆంధ్ర మాట్లాడారు. అయితే చైతూతో జర్నీ ఆగిపోలేదని, ఇద్దరు అనుకున్న వేరు వేరు ఐడియాలను పక్కన పెట్టి, మరో కొత్త ఐడియాతో క్లయిమాక్స్ రూపొందించానని, అది చైతూ కి చెప్పాల్సి వుందని విజయ్ అన్నారు.

నాంది సినిమా టైమ్ లోనే ఉగ్రం సినిమా కథ పుట్టిందని, అప్పట్లోనే ఈ కథ నరేష్ కు చెబితే తప్పకుండా చేద్దామని అన్నారని, ఇప్పటికి మెటీరియలైజ్ అయిందని వివరించారు. నాంది లో పోలీసుల నెగిటివ్ షేడ్ చూపించాను కనుక, ఉగ్రంలో పాజిటివ్ షేడ్ చూపించాలన్న ఆలోచనతో కథ రాయలేదని, నాంది ఎలాగైతే ఓ నిజ సంఘటన ఆధారంగా తయారైందో, ఉగ్రం కూడా అలాగే రూపొందిందని అన్నారు.

ఉగ్రం సినిమాలో హీరో క్యారెక్టర్ లో నరేష్ ను చూస్తారా? జనం యాక్సెప్ట్ చేస్తారా అన్న అనుమానాలు చాలా మందే వ్యక్తం చేసారని, కానీ సినిమా చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుందని అన్నారు. సినిమా ఓ సిన్సియర్ పోలీసు జీవితం గురించి ఫోకస్ చేస్తుందని, స్క్రీన్ ప్లే ముందు వెనుకకు వెళ్తూ వస్తూ వుంటుందని, అందువల్ల ఎక్కడా ఓకే తీరుగా వుండి, బోర్ కొట్టదని అన్నారు.

ఉగ్రం సినిమాకు నైట్ షూట్ ఎక్కువ వుండడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, దానికి తనదే బాధ్యత అని అన్నారు. నిర్మాతలు సాహు, విజయ్ తనను నమ్మి, తాను ఏం తీస్తే, ఎంత ఖర్చు చేస్తే దానికి ఓకె అన్నారని, అందుకే తన మూడొ సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేయాలని డిసైడ్ అయ్యానని అన్నారు. ఇంత కంఫర్ట్ ఇచ్చే నిర్మాతలు తక్కువ మంది వుంటారన్నారు.

ఉగ్రం సినిమాకు చాలా టైమ్ పట్టిందని, సినిమా ఎక్కువ నైట్ షూట్ లు చేయడం, ఇండస్ట్రీ సమ్మె దీనికి కారణాలు అని వివరించారు. సినిమా కాపీ చూసుకున్నామని, చాలా బాగా వచ్చిందని, నరేష్ కు మంచి పేరు తెచ్చి పెట్టే సినిమా అవుతుందని విజయ్ అన్నారు. ఈ సినిమాకు పని చేసిన డైరక్షన్ టీమ్, డివోపీ టీమ్ అంతా తన స్నేహితులే అని, వారంతా ఈ నైట్ షూట్ ల వల్ల, లెంగ్తీ షూట్ ల వల్ల కాస్త ఇబ్బంది పడి వుండొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.