Advertisement

Advertisement


Home > Politics - National

మోడీ స్టేడియంలో మోడీ..!

మోడీ స్టేడియంలో మోడీ..!

త‌న పేరిట ఉన్న క్రికెట్ స్టేడియంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వీక్ష‌కుల‌కు అభివాదం చేశారు. ఇండియా-ఆస్ట్రేలియాల మ‌ధ్య‌న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా జ‌రుగుతున్న నాలుగో టెస్టు ఆరంభం రోజున ఇరు దేశాల ప్ర‌ధాన‌మంత్రులు హాజ‌ర‌య్యారు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఆస్ట్రేలియా ప్ర‌ధానీ.. ఇద్ద‌రూ ఈ క్రీడా వేదిక‌పై మెరిశారు. 

వాహ‌నంలో మైదానం ఆసాంతం తిరిగి ప్రేక్ష‌కుల‌కు అభివాదం చేశారు. భార‌త‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య‌న సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా ఈ మ్యాచ్ స‌మ‌యంలోనే ఆస్ట్రేలియా ప్ర‌ధానికి భార‌త్ కు స్వాగ‌తం ప‌లికిన‌ట్టుగా ఉన్నారు. ఇండియాతో స‌త్సంబంధాల‌ను కోరుకుంటూ ఆస్ట్రేలియా కూడా ఈ క్రీడా వేదిక‌ను దౌత్యానికి ఉప‌యోగించుకుంది. ఇది స్వాగ‌తించాల్సిన అంశమే.

అయితే ఎటొచ్చీ మోడీ స్టేడియంలో మోడీ క‌నిపించ‌డం సైడ్ లైట్ గా మారింది. అహ్మాదాబాద్ లో రెండేళ్ల కింద‌టేమో ఓపెన్ అయిన ఈ స్టేడియం పేరు న‌రేంద్ర‌మోడీ స్టేడియం. వాస్త‌వానికి దీనికి ఆదిలో వేరే పేరు పెట్టారు. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం అంటూ మొద‌ట నామ‌క‌ర‌ణం చేశారు. అయితే ఆ త‌ర్వాత ఆ పేరును తొల‌గించి న‌రేంద్ర‌మోడీ పేరును పెట్టేశారు.

అదేమంటే.. స్టేడియంలో కొంత భాగానికి ప‌టేల్ పేరు అని, మొత్తానికి న‌రేంద్ర‌మోడీ పేరు అని ప్ర‌క‌టించుకున్నారు. ఇదేదో మొద‌టే చేసి ఉంటే అడిగే వారు ఉండ‌రు. అయితే మొద‌ట స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం అంటూ పేరు పెట్టి, తీరా స్టేడియంకు రిబ్బ‌న్ క‌టింగ్ స‌మ‌యానికి న‌రేంద్ర‌మోడీ స్టేడియం అనే స‌రికి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

ఇక న‌రేంద్ర‌మోడీ స్టేడియంలో న‌రేంద్ర‌మోడీ అభివాదాల‌ను కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది. మోడీ సొంత భ‌జ‌న చేసుకోవ‌డంలో ఇది ప‌రాకాష్ట అని కాంగ్రెస్ నేత‌లు సోష‌ల్ మీడియాలో అభిప్రాయ‌ప‌డ్డారు. స్టేడియంల‌కు పేర్లు, ప‌థ‌కాల‌కు పేర్ల విష‌యంలో కాంగ్రెస్ వాళ్ల‌ను బీజేపీ బాగా విమ‌ర్శిస్తుంది. వ్య‌క్తి పూజ కూడ‌ద‌ని అంటుంది. కానీ న‌రేంద్ర‌మోడీ హయాంలోనే ఆయ‌న పేరునే స్టేడియానికి పెట్టారు. 

అలాగే ఢిల్లీల‌లో పాత స్టేడియంకు పేరు మార్చి అరుణ్ జైట్లీ స్టేడియం అంటూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు! వ్య‌క్తిపూజ, కుటుంబాల భ‌జ‌న అంటూ బీజేపీ ప్రాంతీయ పార్టీల‌ను విమర్శిస్తూ ఉంటుంది. మ‌రి అలా త‌ను విమ‌ర్శించ‌క‌పోతే ఇదంత చెప్పుకోద‌గిన మ్యాట‌ర్ కాదు. అయితే త‌ను విమ‌ర్శించే చ‌ర్య‌ల‌ను త‌నే చేస్తూ బీజేపీ ఇలా ప‌లుచ‌న అవుతూ ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?