Advertisement

Advertisement


Home > Politics - National

‘కత్తెర మోజు’ మోడీ పరువు తీసేస్తుందేమో?

‘కత్తెర మోజు’ మోడీ పరువు తీసేస్తుందేమో?

మరోలా అనుకోకండి కత్తెర మోజు అంటే మరేం కాదు.. ప్రారంభోత్సవాలు స్వయంగా చేయాలనే ఆసక్తి. తనే స్వయంగా రిబ్బను కత్తిరించి తన చేతుల మీదుగానే మొదలుపెట్టాలనే ఆశ! ఇలాంటి ఆశ ప్రధాని నరేంద్రమోడీకి పుష్కలంగా ఉంది. అలాంటి కత్తెర మోజు ఇప్పుడు ఆయనను ఇరుకున పెట్టేలా, ఎట్ లీస్ట్ పరువు తీసేలా కనిపిస్తోంది.

పార్లమెంటు నూతన భవన నిర్మాణం పూర్తయింది. 2020లో ప్రధాని స్వయంగా దీనికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో పెద్దగా విపక్షాలనుంచి వ్యతిరేకత రాలేదు. ఈ నెల 28వ తేదీన పార్లమెంటును ప్రారంభించాలని సంకల్పించారు. మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో, ప్రధాని పార్లమెంటును ప్రారంభించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి అవమానం అనే వాదన ఇప్పుడు బహుళంగా వ్యాప్తిలోకి వస్తోంది.

ప్రధాని కేవలం లోక్ సభకు మాత్రమే నాయకుడు అని, భారత ప్రజాస్వామ్యపు గౌరవప్రతీక పార్లమెంటు అయిన నేపథ్యంలో ప్రధానితో ప్రారంభింపజేయడడం సబబు కాదని కాంగ్రెస్, వామపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి మాత్రమే పార్లమెంటు మొత్తాన్ని సమావేశ పరచగలరు గనుక ఆమెకు మాత్రమే ప్రారంభించే హక్కు ఉంటుందనే వాదన తెరపైకి వస్తోంది. ద్రౌపది ముర్ము ప్రారంభించాలని అంటున్నారు.

అయితే నరేంద్రమోడీ తీరు వేరు. తమ డప్పు తామే కొట్టుకోవాలని, మరెవ్వరూ కొట్టరనే సిద్ధాంతాన్ని ఆయన బాగా నమ్ముతారు. గతంలో ఓసారి విశాఖ వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. మన పథకాల గురించి మనమే ప్రచారం చేసుకోవాలి.. అని ఆయన ఉపదేశించారు కూడా. 

కేంద్రనిధులతో  చేసే ప్రతిపనినీ మనమే ప్రారంభించి ఆ మైలేజీ తెచ్చుకోవాలని కూడా సూచించారు. అందుకే కాబోలు, సామాన్యులకు, పేదలకు ఏమాత్రం ఉపయోగపడని వ్యవహారం అయినా వందే భారత్ రైలు సేవలను ఒకసారి ప్రారంభించడం మాత్రమే కాదు.. ప్రతి కొత్త రైలునూ ఆయా ఊర్లకు వెళ్లి మోడీ తనే స్వయంగా ప్రారంభిస్తుంటారు. 

ప్రచారం మిస్సవుతామేమో అని ఆయనకు భయం. అంతటి ప్రచార కాంక్ష ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దేశచరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించే అవకాశాన్ని వదులుకుంటారా? అనేది అనుమానం. కాకపోతే ఈ ప్రచారకాంక్షతోనే ఆయన పరువు పోతుందేమో అని కూడా జనం అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?