ప్రజలకు తాయిలాలు ప్రకటించి వారినుంచి ఓట్లు దండుకునే ప్రజాకర్షక పథకాలకు తమ భాజపా సర్కారు వ్యతిరేకం అని ప్రధాని నరేంద్రమోడీ పదేపదే చెబుతుంటారు. బిస్కట్ రాజకీయాలకు చెక్ చెప్పాలని, ఇలాంటి ప్రజాకర్షక పథకాల రాజకీయాలు, ఆర్థిక క్రమశిక్షణ లేని రాజకీయాలు యావత్తు దేశాన్ని ప్రమాదం అంచులోకి నెట్టేస్తాయిన ప్రధాని చెబుతూ ఉంటారు. ఇవాళ కూడా అలాంటి ప్రవచనం వినిపించారు.
బాధ్యతా రహితమైన ఆర్థిక విధానాలు, ప్రజాకర్షక చర్యలు ఇచ్చే రాజకీయ ప్రయోజనాలు స్వల్పకాలికం మాత్రమేనని, ఇలాంటి పనులు చేయడం వల్ల.. దీర్గకాలంలో సామాజికంగా, ఆర్థికపరంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మోడీ సెలవిచ్చారు. జీ20 సదస్సు సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన సూక్తులు ఇవి.
తాయిలాల రాజకీయం అంటే ఏదైనా సరే అదే కోవలోకి వస్తుంది. తొలినుంచి కూడా ఇలాంటి పథకాలు తమకు వ్యతిరేకం అని అంటూ, సుమారు ఏడాదికి పైగా కాలంనుంచి పదేపదే వాటిని నిందిస్తూ వచ్చారు మోడీ. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి గ్యాస్ సిలిండర్ మీద రూ.200 రేటు తగ్గించారు.
ఇది ఎందుకు చేసినట్టు? ధరవరలు స్థిరంగా ఉండకపోవచ్చు గాక.. కానీ ఎవ్వరూ అడిగి ఎరుగని గ్యాస్ సిలిండర్ల మీద ఉన్నపళంగా ఎందుకు తగ్గించారో తెలియదు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరుగబోతున్న తరుణంలో.. ప్రధాని నరేంద్రమోడీ గ్యాస్ సిలిండరు ధర తగ్గించడం అనేది.. అచ్చంగా.. తాయిలాల రాజకీయమే అని పలువురు విమర్శిస్తున్నారు.
నిజానికి పేద ప్రజలు మిక్కిలిగా ఉండే ఈ దేశంలో.. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. అసలు ప్రధాని మోడీకి సంక్షేమ పథకాలకు, తాయిలాలకు మధ్య ఉండే తేడా తెలుసునా? అనేది పలువురి నుంచి ఎదురవుతున్న ప్రశ్న.
కర్నాటక ఎన్నికల సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంచడం లాంటి పథకాలను బిజెపి ప్రకటించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. వారు చేస్తే సంక్షేమం, ఇతరులు చేస్తే ప్రజాకర్షక పథకాలు అవుతాయా అని విమర్శిస్తున్నారు. నరేంద్రమోడీ మాటల్లో చెప్పేది ఒకటి. చేతల్లో చేసేది ఒకటి అన్నట్టుగా ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు.