రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంలో చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులు జారీ చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. చంద్రబాబునాయుడిని ఆత్మరక్షణలో పడేసేందుకు ఐటీ నోటీసులను అస్త్రంగా ప్రయోగించేందుకు అధికార పక్షమైన వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. తనకు నోటీసులు జారీ చేయడంపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏం పీక్కుంటారో పీక్కోండని ఆయన తన మార్క్ ఎదురు దాడికి దిగారు.
అయితే చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులపై దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్ ఎందుకు మౌనం పాటించారని వైసీపీ నిలదీయడం గమనార్హం. ఇదే వైఎస్ జగన్‌కు నోటీసులు అంది వుంటే ఈ పాటికి పవన్‌కల్యాణ్ ఎక్కడున్నా విమర్శలు చేసేవారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. తనకు ఇష్టమైన చంద్రబాబునాయుడి విషయంలో ఒకలా, జగన్‌కు సంబంధించిన వ్యవహారాల్లో కక్ష పూరితంగా పవన్ వ్యవహరిస్తున్నారంటూ దెప్పి పొడుస్తున్నారు.
చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులపై పవన్‌ను నిలదీస్తూ వైసీపీ ట్విటర్ వేదికగా ప్రశ్నించడం గమనార్హం. అది ఎలాగంటే…
“ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ గానీ జనసేన గానీ స్పందించలేదు.. వీళ్ల తీరు చూస్తూంటే, చంద్రబాబునాయుడు దోచుకున్న అక్రమ సంపాదనలో పవన్‌కల్యాణ్‌కు కూడా వాటా ఉన్నట్లు అనిపిస్తుంది! ఈ కోణంలో ఎందుకు విచారణ జరగకూడదూ?” అని వైసీపీ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతుండడంతో పవన్‌ను వైసీపీ టార్గెట్ చేయడాన్ని గమనించొచ్చు. మరి పవన్ స్పందన ఎలా వుండనుందో చూడాలి.