ద్రౌప‌ది …నెల‌కొల్ప‌నున్న రికార్డు ఏంటంటే!

భార‌త16వ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జాతీయ స్థాయిలో పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి, రిటైర్ ఐఏఎస్ అధికారి య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి.…

భార‌త16వ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు జాతీయ స్థాయిలో పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి, రిటైర్ ఐఏఎస్ అధికారి య‌శ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. ఎన్‌డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము పేరును ఖ‌రారు చేశారు. ద్రౌప‌ది ఎన్నిక లాంఛ‌న‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. జూలై 25న కొత్త రాష్ట్ర‌ప‌తి కొలువుదీర‌నున్నారు.  

ఎన్‌డీఏ అభ్య‌ర్థి ఎంపీక‌లో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఓ గిరిజ‌న మ‌హిళ‌ను ఎంపిక చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ద్రౌప‌ది ముర్ము వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ ప్ర‌స్థానం చాలా చిన్న‌స్థాయి నుంచి మొద‌లు కావ‌డం విశేషం. ఈమె రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైతే త‌న పేరిట రికార్డు నెల‌కొల్ప‌నున్నారు. భార‌త 16వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన గిరిజ‌న మ‌హిళ‌తో పాటు స్వాతంత్ర్యం వ‌చ్చిన పుట్టిన వ్య‌క్తిగా ఆమె రికార్డుకెక్క‌నున్నారు.

ఒడిస్సా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న గిరిజన కుటుంబంలో ద్రౌప‌ది ముర్ము జన్మించారు. గిరిజన వర్గంలోని సంథాల్‌ తెగ ఈమెది. భువనేశ్వర్‌లో డిగ్రీ చదివారు. సాగునీటి-విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో వాలంట‌రీ టీచ‌ర్‌గా పనిచేశారు. ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు. బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000వ‌ సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ త‌ర్వాత మంత్రిగా, జార్ఖండ్ మొద‌టి గవర్నర్‌గా ప‌నిచేశారు. తాజాగా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక‌య్యారు. కేంద్రంలో బీజేపీ బ‌లం దృష్ట్యా ఈమె గెలుపు లాంఛనమే. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన త‌ర్వాత బాల్యం నుంచి త‌న‌కిష్ట‌మైన శివాలయానికి వెళ్లారు. గుడి అంతా చీపురుతో శుభ్రం చేసే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.