సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. వేతనాలు పెంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూనే, కొన్ని కండిషన్లు పెట్టారు. రేపట్నుంచి ఉన్నఫలంగా షూటింగ్స్ కు వస్తే, ఎల్లుండి నుంచి వేతనాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. అలా జరగని పక్షంలో తాము కూడా షూటింగ్స్ నిలిపేస్తామని హెచ్చరించారు.
వేతనాలు పెంచాలనే డిమాండ్ తో షూటింగ్ కు రావొద్దని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా షూటింగ్స్ కు వస్తే జీతాలపై చర్చిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ ఒక్క రోజు షూటింగ్స్ ఆగిపోవడం వల్ల నిర్మాతలకు 2 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ఇకనైనా బెట్టు చేయకుండా షూటింగ్స్ కు రావాలని విజ్ఞప్తి చేశారు.
రేపట్నుంచి కార్మికులు షూటింగ్స్ కు రాకపోతే బండారం మొత్తం బయటపెడతాం అనే అర్థం వచ్చేలా హెచ్చరిక జారీచేశారు నిర్మాతలు. పని చేయకుండా ఎక్కడ్నుంచో కార్మికుల్ని తీసుకొచ్చి, వాళ్లకు కూడా నిర్మాతతో పేమెంట్స్ ఇప్పించుకునే ఘటనలు ఉన్నాయని, అలాంటివి ఆపాలని ప్రొడ్యూసర్స్ అన్నారు.
బయట దినసరి వేతనాలతో పోలిస్తే, సినీకార్మికులకు 150శాతం అదనంగా వేతనాలు ఇస్తున్నామని తెలిపిన నిర్మాతలు.. 2 పూటలు భోజనం పెట్టి వేతనం ఇస్తున్న రంగం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. వేతనాల పెంపునకు సంబంధించి కనీసం 2-3 నెలల చర్చలు జరుగుతాయని, ఉన్నఫలంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని అన్నారు.
అసలు సమ్మె చేస్తున్నామంటూ ప్రాపర్ గా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కేవలం లేఖ ఇచ్చి మెరుపు సమ్మె చేశారని ఆరోపించారు నిర్మాతలు. యూనియన్ రూల్స్ ఫార్మాట్ లో సమ్మె నోటీసు ఇవ్వలేదని అన్నారు. ఎక్కువ వేతనం ఇచ్చే నిర్మాతలకు మాత్రమే సినిమాలు చేస్తామని కార్మిక సంఘాలు భావిస్తే, పక్క రాష్ట్రాల నుంచి సినీ కార్మికుల్ని తెచ్చుకొని పని చేయించడానికి ఏమాత్రం వెనకాడమన్నారు నిర్మాతలు. ఎవరు ఎవరితోనైనా పని చేయొచ్చు, పని చేయుంచుకోవచ్చు అనే నిబంధనను ఈ సందర్భంగా ప్రస్తావించారు.