పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరుస్తానంటున్నాడు. సామాజిక చైతన్యం తెస్తానంటున్నాడు. జనజీవనాన్ని మారుస్తామంటున్నాడు. సంతోషం. మాటకి కట్టుబడి ప్రజల్లో వుండి పోరాడితే చాలా సంతోషం.
ఎక్కడో అనంతపురంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, వచ్చి, ఊరడించి జగన్‌ని తిట్టి వెళ్లే పవన్ తన సొంత పరిశ్రమ కష్టాలను ఏ మాత్రం పట్టించుకున్నాడన్నది ప్రశ్న. నాలుగేళ్లుగా సినీ కార్మికులకి వేతనాలు పెరగకపోతే నోరు విప్పాలి కదా? ఈ రోజు వాళ్లు చాంబర్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంటే “మీకు తోడుగా నేనుంటాను” అని పవన్ కనబడాలి కదా! నాలుగేళ్ల క్రితం ధరలకి, ఇప్పటికి ఎంత తేడానో అందరికీ తెలుసు. సినిమా కార్మికులకి వచ్చేదెంతో కూడా హీరోలకి తెలుసు.
నాలుగేళ్ల క్రితం రెమ్యునరేషన్లే పవన్ తీసుకుంటున్నాడా? ఏ హీరో అయినా తీసుకుంటున్నాడా? తెరమీద ఉపన్యాసాలు ఇచ్చే వాళ్లకి తోటి కార్మికులు ఎలా బతుకుతున్నారో తెలియదా? పవన్‌కల్యాణ్ కార్మిక నాయకుడిగా నటిస్తే, ఈ బక్క జీవులే కదా కార్మికులు. ఆయన SI గా నటిస్తే వీళ్లే కదా కానిస్టేబుళ్లు.
ఈ ప్రశ్న పవన్‌కి మాత్రమే కాదు, అందరు హీరోలకి కూడా. పవన్ జనజీవితంలోకి వచ్చాడు కాబట్టి మొదటి ప్రశ్న ఆయనకి. కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుని, అవసరం లేకపోయినా విదేశాల్లో షూటింగ్ పెట్టి 50 లేదా 100 కోట్లు ఖర్చు చూపించి, టికెట్ రేట్లు తేడా వస్తే ప్రత్యేక విమానంలో వెళ్లి జగన్‌కి దండం పెట్టి రేట్లు పెంచుకోవడం న్యాయం అయినప్పుడు, కష్ట జీవులకి నాలుగేళ్లు వేతనం పెంచకపోవడం అన్యాయం అనిపించలేదా? నిర్మాతల దగ్గర వీళ్లెందుకు మాట్లాడరంటే, తమ రెమ్యునరేషన్ తగ్గించమని అడుగుతారని భయం.
జూనియర్ ఆర్టిస్టుల వరకు తీసుకుంటే, బాహుబలి లాంటి సినిమాల్లో తప్ప, మిగతా సినిమాల్లో వాళ్ల అవసరం పెద్దగా లేదు. మన వాళ్లు ఈ మధ్య విదేశాల్లో తీసేసరికి సగం సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుండరు. అసలే పనిలేదు. పని వున్నప్పుడైనా వేతనం పెంచమని అడుగుతున్నారు. అది కూడా అన్యాయం అంటే ఎట్లా?
నిర్మాతలు హీరోల కోసం డైరెక్టర్ల మాటలు విని ఎంతైనా ఖర్చు పెడతారు కానీ, ఆ దుబారాని కార్మికుల వద్ద పొదుపు చేయాలని అనుకుంటున్నారు. భోజనాల్లో కూరలు తగ్గించడం, పెరుగుకు బదులు మజ్జిగ పోయడం చేసేవాళ్లు కూడా వున్నారు. సినిమాల్లో నక్సలైట్ల పాత్రలు వేసేవాళ్లు, తోటి కార్మికులు ఏ రకం భోజనం తింటున్నారో చూస్తే కదా! తమ కారవాన్‌ల్లో స్టార్ హోటల్ తిండి తింటూ సమసమాజం డైలాగ్ పేపర్ బట్టి కొడితే జనం కష్టాలు తెలుస్తాయా?
బాల్ పవన్‌కల్యాణ్ కోర్టులో వుంది. ఇల్లు చక్కదిద్ది, వీధిలోకి రావాలని ఇండస్ట్రీలోని బడుగు జీవులు కోరుతున్నారు. కెమెరా ముందు యాక్షన్‌లోకి దిగడం సులభం. జీవితంలో కష్టం.
జీఆర్ మహర్షి