భార్యాభర్తలన్న తర్వాత గిల్లికజ్జాలు సహజం. ఆ భర్త కూడా అలానే ఫీలయ్యాడు. సర్దుకుపోదాంలే అనుకున్నాడు. కానీ గొడవలో భాగంగా అసలు విషయం తెలిసి షాకయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్ లో చూసి ఇష్టపడిన మనువాడిన భార్యకు ఇదివరకే పెళ్లయిందని తెలిసి ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.
ఇక్కడ అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. ఆమెకు ఒకటో రెండో పెళ్లిళ్లు అవ్వలేదు. ఏకంగా 8 పెళ్లిళ్లయ్యాయి. ఇతడ తొమ్మిదో భర్త. తెలంగాణలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది
ఇంతకీ ఏం జరిగింది..?
కృష్ణా జిల్లా గుంపలగూడెంకు చెందిన వ్యక్తి పెళ్లి కోసం మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు నమోదు చేసుకున్నాడు. అదే సైట్ లో మెహబూబాబాద్ కు చెందిన స్వప్న ప్రొఫైల్ అతడికి నచ్చింది. ఇద్దరూ మాటలు కలిపారు. స్వయంగా స్వప్న తన కుటుంబ సభ్యులతో కలిసి గుంపలగూడెం వచ్చి పెళ్లి సెట్ చేసుకుంది. అలా పెళ్లి చేసుకొని బెంగళూరులో కాపురం పెట్టారు.
అయితే భార్య ఎప్పుడూ ఫోన్ లో కోర్టు కేసులు, లాయర్ అంటూ మాట్లాడ్డం భర్త గమనించాడు. అడిగితే స్వప్న విసుక్కునేది. ఓరోజు సడెన్ గా హైదరాబాద్ వెళ్లాలని చెప్పి వెళ్లిపోయింది. 2 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఆ వెంటనే మరోసారి హైదరాబాద్ వెళ్లాలంటూ బయల్దేరింది. దీంతో భర్తకు అనుమానం వచ్చింది. ఈసారి తను కూడా హైదరాబాద్ బయల్దేరాడు. భార్యకు తెలియకుండా ఆమెను ఫాలో అయ్యాడు.
హైదరాబాద్ వెళ్లిన స్వప్న నేరుగా కోర్టుకు చేరుకుంది. అప్పుడు భర్తకు అసలు విషయం తెలిసింది. స్వప్నకు అప్పటికే 8 పెళ్లిళ్లు అయ్యాయి. వాటికి సంబంధించిన విడాకుల కేసుల విచారణ కోసం ఆమె కోర్టుకు హాజరవుతోంది. ఈమెను పెళ్లి చేసుకున్నోళ్లలో కొందరు ఇప్పటికే మరణించారు కూడా.
విషయం తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు. స్వప్నను నిలదీశాడు. అప్పటికే ఇలాంటి వ్యవహారాలు ఎన్నో చూసిన స్వప్న తిరగబడింది. రివర్స్ లో భర్తపైనే కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. స్వప్న ఏడుపు చూసి మెహబూబాబాద్ పోలీసులు నిజం అనుకున్నారు.
కానీ భర్త వచ్చి అసలు విషయం చెప్పాడు. అంతకుముందు జరిగిన 8 పెళ్లిళ్ల వివరాల్ని సాక్ష్యాలతో సహా పోలీసులకు అందించాడు. దీంతో స్వప్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించే పనిలో పడ్డారు. ఇలా నిత్యపెళ్లికూతురు బాగోతం బయటపడింది.