ఎంతో మందిని ఈడీ విచారణలకు పంపడం వెనుక సోనియాగాంధీ పైనే కుట్ర ఆరోపణలు వచ్చాయి. డైరెక్టుగా సోనియా గాంధీ కనుసన్నలతోనే ఈడీ కొంతమంది రాజకీయ నేతలను విచారించిందనే విశ్లేషణలు ఉన్నాయి. డైరెక్టుగా సోనియా ప్లానే కాకపోయినా.. ఆమె భజనపరులు, ఆమె ద్వారా పవర్ చేజిక్కించుకున్న వాళ్లు తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను అనేక సార్లు ప్రయోగించారు కూడా! ఇదంతా ఓపెన్ సీక్రెట్.
ఇంత స్పష్టమైన రాజకీయం జరుగుతున్న భారత దేశంలో ఇప్పుడు అదే ఈడీ విచారణకు డైరెక్టుగా సోనియాగాంధీ హాజరయ్యారు. ఇప్పటికే ఈ విషయంలో సోనియా ఎంతో బాధపడి ఉంటారు. ఎందుకంటే.. ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఆమె కన్నా మునుపే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. తను ఈడీ ముందు కూర్చోవడం కన్నా.. తన తనయుడు ఈడీ ముందు హాజరు కావడం సోనియాకు ఎక్కువ బాధను కలిగించే అంశం కావొచ్చు.
అయితే గతంలో ఈడీ తో ఈ తరహా ఇబ్బందులు పడ్డవారు ఆ తర్వాత రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. సీబీఐ, ఈడీలను సోనియా, కాంగ్రెస్ లు ప్రయోగించగా.. వాటిని ఎదుర్కొన్న వైఎస్ జగన్ లాంటి వాళ్లు కాంగ్రెస్ ను తమ పరిధిలో మళ్లీ మొలకెత్తకుండా చూసుకున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు ఈడీ విచారణను రాజకీయంగా అడ్వాంటేజ్ గా మలుచుకోవాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది.
తాము గతంలో ఈడీని ప్రయోగించి ఆ తర్వాత రాజకీయంగా అడ్రస్ కోల్పోయినట్టుగానే.. ఇప్పుడు కూడా బీజేపీ కూడా ఈడీని తమపై ప్రయోగిస్తూ దెబ్బతింటుందని కాంగ్రెస్ లెక్కేసుకోవచ్చు! అయితే ఆ లెక్కలు అంత తేలికగా వేయగలిగేవి కావు. అయితే రాహుల్ ఈడీ ముందు విచారణకు హాజరైనప్పుడు మాత్రం కాంగ్రెస్ బాగానే రాజకీయం చేసింది.
రాహుల్ కూడా ఏదో ఆసనం ద్వారా ఈడీ విచారణను ఎదుర్కొన్నట్టుగా పంచ్ డైలాగేదో వేశాడు. ఇప్పుడు సోనియాకు ఆరోగ్యం బాగోలేకపోయినా.. ఆమెను ఈడీ విచారణ పేరుతో వేధిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే సానుభూతి పండటం లేదు!
అయితే ఇంతలో కర్ణాటక నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. తమ బోటి వాళ్లు గతంలో నెహ్రూ, గాంధీల పేర్లు చెప్పుకుంటూ కావాల్సినంత సంపాదించుకున్నామని, తరాలకు తగ్గట్టుగా ఆస్తులు సంపాదించినట్టుగా.. తామేమో అలా సెటిలైతే సోనియాగాంధీ మాత్రం ఇప్పుడు ఈడీ విచారణకు హాజరు కావడం తమకు ఎంతగానో బాధ కలిగించే అంశమంలూ కన్నీరు పెట్టుకున్నారట! ఈయన కదా.. సిసలైన కాంగ్రెస్ నేత!