ఊహూ…రాహుల్‌కు నిరాశే!

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీకి నిరాశ ఎదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ సూర‌త్ సెష‌న్స్ కోర్టును రాహుల్ ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అడిష‌న‌ల్ సెష‌న్స్…

ప‌రువు న‌ష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీకి నిరాశ ఎదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే ఇవ్వాలంటూ సూర‌త్ సెష‌న్స్ కోర్టును రాహుల్ ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అడిష‌న‌ల్ సెష‌న్స్ కోర్టు జ‌డ్జి ఆర్‌పీ మొగేరా ఇవాళ తీర్పు వెలువ‌రించారు. రాహుల్ పిటిష‌న్‌ను కొట్టి వేయ‌డంతో ఆయ‌న‌కు చుక్కెదురైంది. ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్ హైకోర్టును రాహుల్ ఆశ్ర‌యించ‌నున్నారు.  

రెండేళ్ల శిక్ష నేప‌థ్యంలో రాహుల్ లోక్‌స‌భ సభ్య‌త్వం కూడా కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. కేంద్రం వైఖ‌రిపై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదిలా వుండ‌గా, 2019 ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా  కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ ప్ర‌సంగిస్తూ మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని ఆయ‌న అన‌డం రాజ‌కీయ దుమారానికి దారి తీశాయి. ఈ సంద‌ర్భంగా రాహుల్ ప‌లు ఆర్థిక నేరాల్లో కూరుకుపోయిన నీర‌వ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ త‌దిత‌ర పేర్ల‌ను  ఉదహరించారు.

రాహుల్ వ్యాఖ్య‌లు త‌మ‌కు మ‌న‌స్తాపం క‌లిగించాయ‌ని, ప‌రువుకు భంగం క‌లిగించేలా ఉన్నాయంటూ సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసుపై విచారించిన  సూరత్‌ దిగువ కోర్టు విచారణ గ‌త నెలలో రాహుల్‌ను దోషిగా నిర్ధారించింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఇదే అదునుగా భావించి ఏకంగా ఆయ‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా ర‌ద్దు చేశారు.

శిక్ష‌ను స‌వాల్ చేస్తూ పైకోర్టును ఆశ్ర‌యించ‌డానికి నెల రోజుల గ‌డువు ఇచ్చిన‌ప్ప‌టికీ, కేంద్ర ప్ర‌భుత్వం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. ఇటీవ‌ల రాహుల్ గాంధీ త‌న అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. తాజాగా మ‌రోసారి ఎదురు దెబ్బ త‌గ‌ల‌డంతో రాహుల్ పోరాలం ఏ మ‌లుపు తిర‌గ‌నుందో!