రాహుల్ గాంధీకి మిగిలిన అన్ని దారులూ మూసుకుపోయాయి. ఒకే ఒక్కటి మిగిలింది. కొంత గ్యాప్ తీసుకుని, దానివల్ల ఒనగూరగల ప్రయోజనాలను బేరీజు వేసుకుని.. గత వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వాదనలను ఎలా తయారుచేసుకోవాలో ప్లాన్ చేసుకుని మొత్తానికి రాహుల్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. తాను జైలుకు వెళ్లే ప్రమాదం రాకుండా కాపాడమని అంటున్నారు.
మోడీ ఇంటిపేరు గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ ఇంకా ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. అదే ఇంటిపేరున్న ఒక వ్యక్తి క్రిమినల్ పరువునష్టం దావా ద్వారా కోర్టును ఆశ్రయించడంతో.. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ప్రజాప్రతినిధుల నేరాలకు సంబంధించిన చట్టం ప్రకారం.. తీర్పు వచ్చిన రోజునుంచే ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దయిపోయింది.
పాపం.. ఆయన అధికారిక క్వార్టర్ ను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. కాకపోతే పై కోర్టు సదరు సూరత్ కోర్టు విధించిన శిక్షను హోల్డ్ చేయడం వలన.. రాహుల్.. ఇంకా బహిరంగ కార్యకలాపాల్లో తిరుగుతూ, విపక్ష భేటీలకు హాజరవుతూ, మోడీ సర్కారు మీద ఒకింత మాటనిలకడతో నిప్పులు చెరుగుతూ ఉన్నారు.
రాహుల్ కు జైలుయోగం తప్పదేమో అనిపించేలా.. గుజరాత్ హైకోర్టు కూడా ఆయన చేసుకున్న అప్పీలును కొట్టి వేసింది. కనీసం సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి కూడా సరైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ హతాశులయ్యారు. సరైన కారణాలు హైకోర్టుకు కనిపించలేదంటే.. తమ వాదనను సరిగ్గా చెప్పుకోలేకపోయినట్టే అని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.
దాంతో కొన్ని రోజుల పాటు న్యాయనిపుణులతో మల్లగుల్లాలు పడిన తర్వాత.. రాహుల్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను కొట్టేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది రాహుల్ కు మిగిలిన ఆఖరి మార్గం.
సుప్రీం కూడా ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లయితే.. జైలుకు వెళ్లక తప్పదు. తత్పలితంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కూడా రాహుల్ కోల్పోతారు. రెండేళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తికి ఆరేళ్లపాటు పోటీచేసే అర్హత ఉండదనే సంగతి అందరికీ తెలిసిందే.