కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఇది భారతీయ జనతా పార్టీ వారు 2014 నుంచి ఇస్తున్న నినాదం! అప్పట్లో అధికారం అలా అందగానే.. ఇక దేశంలో కాంగ్రెస్ ను దుంపనాశనం చేయాలని బీజేపీయులు కంకణం కట్టుకున్నారు! ప్రతిపక్షం అంటూ ఉండకూడదనుకున్నారు! అందుకు తగ్గట్టుగా దేశంలో కమలం పార్టీ అప్పుడు శరవేగంగా విస్తరించింది. వివిధ రాష్ట్రాల్లో అధికారం అందుకుంది. ప్రజలు అధికారం ఇవ్వని చోట అడ్డదారులు తొక్కింది.
కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర..ఇలా అనేక చోట్ల అడ్డదారుల్లో అధికారం అందుకుంది. అంతా కాషాయమని ఇలా కలరింగ్ ఇచ్చుకుంది. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని, తుడిచిపెట్టుకుపోతోందని ప్రచారం చేసుకుంటూ వస్తోంది!
భాజపేయులు ఇలా కాంగ్రెస్ ముక్త్ అంటూ కలలు కంటుంటే, కంకణాల మీద కంకణాలు పట్టుకుంటూ ఉంటే.. ఒక రాష్ట్రంలో మాయమైనట్టుగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో ఉనికిని చాటుకుంటూ ఉంది. పంజాబ్ వంటి రాష్ట్రంలో అధికారం కోల్పోయింది ఇటీవలే. అయితే ఆ అవకాశం బీజేపీకి దక్కలేదు. ఆప్ దక్కించుకుంది. ఇప్పుడు హిమాచల్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టారు. ప్రజలైతే కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. అయితే బీజేపీ ఇక్కడ తన మార్కు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడనిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
దేశంలో హిమాచల్ బుల్లి రాష్ట్రమే కావొచ్చు. అయితే ఎక్కడా కాంగ్రెస్ ఉనికంటూ ఉండకూడదనేది బీజేపీ కోరిక. బుల్లి రాష్ట్రం అయినా, పెద్ద రాష్ట్రం అయినా.. కాంగ్రెస్ పేరే వినిపించకూడదని బీజేపీ ఎనిమిదేళ్లుగా ఆరాటపడుతూ ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ నినాదాలను వినిపించుకోవడం లేదు. తమకు అవసరమైన చోట, కాంగ్రెస్ ఉనికి ఉన్న చోట ప్రత్యామ్నాయంగా ఆ పార్టీకే అవకాశం ఇస్తున్నారు.
ఇందుమూలంగా బీజేపీ నేతలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. తమకు ప్రత్యామ్నాయం అంటూ అవసరం లేదని కాషాయవాదులు అనుకోవచ్చు కానీ, ప్రజలు మాత్రం అలా అనుకోవడం లేదు. ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఎప్పుడూ దృష్టిలో ఉంచుకునే ఉన్నారు. ఎన్ని తంత్రాలు, కుతంత్రాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా.. ప్రజలకంటూ అభిప్రాయాలుంటాయి. వారి చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది.
హిమాచల్ లో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలిచింది కాబట్టి, అక్కడ ఇప్పుడు ఆ పార్టీకి ఆదరణ దక్కింది. సరైన రీతిలో నిలిచి పోరాడితే.. ఈ రోజు హిమాచల్ లో ప్రత్యామ్నాయంగా నిలిచిన పార్టీనే కేంద్రంలోనూ ప్రత్యామ్నాయం కావొచ్చు! పారాహుషార్!