ఎమ్మెల్యేగా నెగ్గిన .. క్రికెట‌ర్ భార్య‌!

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజా. జామ్న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈమె త‌న స‌మీప ఆప్…

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజా. జామ్న‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈమె త‌న స‌మీప ఆప్ ప్ర‌త్య‌ర్థిపై న‌ల‌భై వేల‌కు పైగా మెజారిటీని సాధించింది. మొద‌టి రౌండ్ల‌లో రివాబాకు పోటీ ఇచ్చిన ఆప్ అభ్య‌ర్థి ఆ త‌ర్వాత పూర్తి వెనుక‌బ‌డిపోయారు. దీంతో రివాబా జ‌డేజా ఎమ్మెల్యేగా ఘ‌న విజ‌యం న‌మోదు చేస్తోంది.

భ‌ర్త ఇంకా జాతీయ జ‌ట్టుకు ఆడుతుండ‌గా, ఇలా ఈమె రాజ‌కీయాల్లోకి రావ‌డం ఒకింత వింతే! సాధార‌ణంగా జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించేట‌ప్పుడు ఆట‌గాళ్లు ఇలా రాజ‌కీయాల్లోకి త‌ల‌దూర్చ‌రు. అంత‌ర్జాతీయ క్రికెట్ కు దూరం అయ్యాకా.. రాజ‌కీయ పార్టీల స‌భ్య‌త్వాలు తీసుకునే వాళ్లు బోలెడంత‌మంది ఉంటారు. అనేక మంది క్రికెటర్లు ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేశారు, గెలిచారు, ఓడారు! 

మ‌రి కొంత‌మంది క్రికెట‌ర్లు జాతీయ జ‌ట్టులో ఉండ‌గానే పార్టీల త‌ర‌ఫున ప్ర‌చారాల‌కు తిరిగిన సంద‌ర్భాలు కూడా అరుదుగా ఉన్నాయి. అయితే అది కూడా త‌మ ఫ్రెండ్స్ త‌ర‌ఫున ప్ర‌చారాలే. గ‌తంలో హ‌ర్భ‌జ‌న్ సింగ్  పంజాబ్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌, వేరే పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున కూడా ప్ర‌చారం చేశాడు. అదేమంటే.. పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, త‌న స్నేహితులు ఎన్నిక‌ల్లో పోటీ చేసినందున వారి త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన‌ట్టుగా వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు. 

ఇటీవ‌లే ర‌వీంద్ర జ‌డేజా భార్య భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరింది. ఈమె పోటీ చేసిన జామ్న‌న‌గ‌ర్ ఏరియాలో ఆమె కుటుంబీకులు మొద‌టి నుంచి రాజ‌కీయంగా యాక్టివ్ గా ఉన్న‌ట్టున్నారు. కాంగ్రెస్ లో కూడా వీరి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఉన్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసింది కూడా వీరి బంధువే. 

ర‌వీంద్ర జ‌డేజా సోద‌రి కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసింది! జ‌డేజా బావ‌మ‌రిది ఒక‌రు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఇలా వీరి కుటుంబ‌మే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ త‌ర‌ఫున పోటీ లో నిలిచింది. స్థానికంగా రాజ్ పుత్ సంఘాల్లో కూడా వీరు యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో.. మొత్తానికి జ‌డేజా భార్య ఎమ్మెల్యేగా గుజ‌రాత్ అసెంబ్లీలో అడుగుపెడుతున్న‌ట్టుంది.