అవాకులు చెవాకులు పేలితే నిజాంబాద్ నడిరోడ్డుపై చెప్పుతో కొడ్తానని ఎంపీ అర్వింద్‌ను ఎమ్మెల్సీ కవిత హెచ్చరికను టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే రేఖా నాయక్ స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అలాగే మరో ఎంపీ సోయం బాపురావు తదితరులు కేసీఆర్, కవితలపై చేసిన వ్యాఖ్యలపై ఆమె సీరియస్‌గా స్పందించారు. కేసీఆర్, కవితపై నోరు జారితే నాలుక కోస్తాం జాగ్రత్త అని రేఖా నాయక్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత దొంగసారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటోందని విమర్శించారు. ఈ నెల 11న విచారణలో ఆమె సంగతి తేలిపోతుందన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఓ అవినీతి ఆనకొండ అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో రేఖా నాయక్ ఘాటు స్పందన చర్చకు దారి తీసింది. తనపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. దుబాయ్ గురించి మాట్లాడుతున్నారని, తాను 25 దేశాలకు వెళ్లినట్టు ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వమే తనను అమెరికా పంపిందన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆమె హెచ్చరించడం గమనార్హం. మహిళలపై మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు. ఛీప్‌లిక్కర్ తాగేవాళ్లకే దాని గురించి తెలుసని, అందుకే వాళ్లు మాట్లాడుతున్నారని దెప్పి పొడిచారు.
బండి సంజయ్ ఎన్ని జూట మాటలు మాట్లాడినా జనం నమ్మరన్నారు. సోయం బాపురావు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంద్రవెల్లి చౌరస్తా దగ్గరికి వచ్చి బాపురావు గురించి మాట్లాడ్తానని ఆమె హెచ్చరించారు. బీజేపీ నాయకులు తనతో పాటు టీఆర్ఎస్ నేతల గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే బొంద పెట్టి గోరీ కడ్తానని రేఖా నాయక్ హెచ్చరించడం విశేషం.