Advertisement

Advertisement


Home > Politics - National

ప్లాస్టికోసిస్.. మానవజాతికి భవిష్యత్ ముప్పు ఇదే

ప్లాస్టికోసిస్.. మానవజాతికి భవిష్యత్ ముప్పు ఇదే

ప్లాస్టిక్ పదార్థాల్లో చాలావరకు కార్సినో జెనిక్ అని మనందరికీ తెలుసు. అంటే ప్లాస్టిక్ లేదా, వాటి కలయిక వల్ల తయారయ్యే పదార్థాల్లో ఉన్న ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటారు. లోహాల వాడకంలో ఓ సరికొత్త విప్లవంగా పుట్టుకొచ్చిన ప్లాస్టిక్, మానవాళి జీవితాన్ని సులభతరం చేయడంతో పాటు ముందు తరాలకు తీరని నష్టం కలిగిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ హాని అటుంచితే, ప్లాస్టిక్ అవశేషాలు కడుపులోకి వెళ్తే జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం మనుషులకే కాదు జంతువులు, పక్షులకు కూడా హానికరం.

సహజంగా పక్షుల జీర్ణ వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది. కోడి నేలపై ఉన్న గింజలతో పాటు, దానికి అంటుకుని ఉన్న ఇసుక రేణువుల్ని కూడా ముక్కుతో లోపలికి తీసుకుంటుంది. కానీ అది వాటికి హానికరం కాదు. కొన్నిరకాల పక్షులు కూడా సహజసిద్ధంగా తీసుకునే ఆహారంతో పాటు ఇసుక, మట్టి కూడా లోపలికి వెళ్లినా దాన్ని బయటకు పంపించే జీర్ణక్రియ వాటిలో ఉంటుంది. కానీ ప్లాస్టిక్ అలా కాదు. ప్లాస్టిక్ ని పక్షులు కడుపులోకి తీసుకుంటే వాటికి రోజులు మూడినట్టే. ఇప్పుడదే జరుగుతోంది. దాని పేరే ప్లాస్టికోసిస్.

ప్లాస్టిక్ వ్యర్థాలు కడుపులోకి వెళ్లి పక్షులు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సైంటిస్ట్ లు దీనిపై విస్తృత పరిశోధనలు చేసి ప్లాస్టికోసిస్ మూలాలు, పర్యవసానాలు కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని లార్డ్ హో ద్వీపంలో మృత్యువాత పడిన పక్షులను పరీక్షించిన తర్వాత ఈ విషయం బయటపడింది.

భూమి మీద మనుషులు వినియోగించిన ప్లాస్టిక్ లో అతి కొద్దిగా మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగతాదంతా జలచరాల వద్దకు చేరుకుంటోంది. మురుగు కాల్వలు, నదులు, ఆ తర్వాత వాటి కేరాఫ్ అడ్రస్ సముద్రాలు మాత్రమే. సముద్ర తీరాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర పక్షులకు ఆహారంగా మారుతున్నాయి. పొరపాటున వాటిని తీసుకున్న పక్షులు జీర్ణించుకోలేక అగచాట్లు పడుతున్నాయి. పొట్ట ఉబ్బిపోయి చివరకు చనిపోతున్నాయి. ఆహారం కోసం వేటకు వెళ్లే పెద్ద పక్షులే కాదు, అవి తీసుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన ఆహారం తీసుకునే చిన్న చిన్న పిల్లలు కూడా ప్లాస్టికోసిస్ బారిన పడి చనిపోవడం దారుణం.

ఇటీవల కాలంలో పక్షుల సామూహిక మరణాలకు ఈ ప్లాస్టికోసిస్ మూల కారణం. పైకి పక్షులు ఆరోగ్యంగా ఉన్నట్టే కనపడతాయి. కానీ లోపల జీర్ణంకాని ప్లాస్టిక్ నిల్వలు పేరుకుంటే ఒక్కసారిగా అవి మరణిస్తాయి. అనారోగ్యంతో క్షణం క్షణం ప్రాణం తీయదు, ఒకేసారి ఊపిరి ఆగిపోయేలా చేస్తుంది ప్లాస్టికోసిస్.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఎన్ని పరిశోధనలు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించలేనంత కాలం ఈ దుష్పరిణామాలు తప్పవు. ఇది ఇలానే కొనసాగితే, భవిష్యత్ తరాలు మరింత ప్రమాదంలో పడతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?