ఎలిజబెత్II మహారాణికి పట్టాభిషేకం జరిగి 70 ఏళ్లైంది. ఇంగ్లండ్‌లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడామె వయసు 96 ఏళ్లు. 1953 జూన్‌లో పట్టాభిషేకం జరిగింది. 1952లో కిరీటం ధరించారు.
రెక్కల గుర్రం మీద రాకుమారుడు వస్తాడని అమ్మాయిల కలైతే ఎలిజిబెత్కి సింహాసనమే రెక్కల గుర్రం మీద వచ్చి వాలింది. నిజానికి ఆమె వారసురాలు కాదు. సింహాసనం అనుకోకుండా దక్కింది.
ఆమె పెదనాన్న ఎడ్వర్డ్ 7 వాలిస్ సింప్సన్ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అప్పటికే ఆమెకి రెండు పెళ్లిళ్లు, విడాకులయ్యాయి. ఆ కాలంలో విడాకులు తీసుకున్నా, భర్త బతికున్న అమ్మాయిని చేసుకోవడం చర్చికి అభ్యంతరకరం. ఎడ్వర్డ్ ప్రేమని ఎవరూ అంగీకరించలేదు. వాలిస్కి మహారాణి హోదా ఉండదని. ఆమె పిల్లలు సింహాసన వారసులుగా ఉండరని ఎడ్వర్డ్ చెప్పినా ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ప్రేమ కోసం ఎడ్వర్డ్ సింహాసనాన్ని వదిలేశాడు. దాంతో ఎలిజబెత్ తండ్రి జార్జికి పదవి దక్కింది. ఆయన మరణం తర్వాత ఆమె రాణి అయ్యారు.
70 ఏళ్లలో ఆమె పెద్దగా పెదవి విప్పలేదు. ప్రెస్‌కి దూరంగా ఉన్నారు. 14 మంది ప్రధాన మంత్రుల్ని చూసిన ఏకైక రాణి. మార్గరేట్ థాచర్ పాలనపైన (1979-90) కొంచెం అసంతృప్తి ఉన్నట్టు పుకార్లు వచ్చినా, ప్రభుత్వంపైన రాణి ఎన్నడూ కామెంట్ చేయలేదు.
దేశానికి మహారాణి అయినా ఆమె ఆస్తి 370 మిలియన్ పౌండ్స్ మాత్రమే. లండన్‌లోని సంగీతకారుడు ఎల్టన్‌జాన్ ఆమె కంటే ఆస్తిపరుడు. పెద్ద కొడుకు చార్లెస్ (1980) ఇండియా వస్తే నటి పద్మిని కొల్హాపురి ముద్దు పెట్టుకుని సంచలనం సృష్టించింది. డయానా చనిపోయినపుడు రాణి పెద్దగా బాధపడలేదని అంటారు. అయితే డయానా పిల్లలు ఆమె వద్దే పెరుగుతున్నారు.
1947లో ఫిలిప్ రాకుమారుడితో పెళ్లి జరిగింది. ఒక రకంగా ప్రేమ వివాహమే. 99 ఏళ్ల వయసులో ఆయన గత ఏడాది చనిపోయారు.
జీఆర్ మహర్షి