అప్పీలుకు వెళ్లకుండా ఇదంతా ఎందుకు?

చట్టంలో మంచి ఉన్నదా? చెడు ఉన్నదా? అనే విషయాన్ని గౌరవ చట్ట సభ సభ్యులు దాని గురించి పార్లమెంటు చర్చ జరిగినప్పుడే మాట్లాడాలి. తర్కించుకోవాలి. ఆ చట్టం చాలా కాలంగా అమలు అవుతూ ఉండగా..…

చట్టంలో మంచి ఉన్నదా? చెడు ఉన్నదా? అనే విషయాన్ని గౌరవ చట్ట సభ సభ్యులు దాని గురించి పార్లమెంటు చర్చ జరిగినప్పుడే మాట్లాడాలి. తర్కించుకోవాలి. ఆ చట్టం చాలా కాలంగా అమలు అవుతూ ఉండగా.. ఇప్పటికే చాలా మంది ఆ చట్టం ప్రకారం.. జైలు శిక్ష పడిన తక్షణం తమ పదవులను కోల్పోతూ ఉండగా.. ఇన్నాళ్లూ మిన్నకుండి పోయి ఇప్పుడు మాత్రం ఎందుకు యాగీ చేస్తున్నారు?.

ఇతరు నాయకులు ఎంతో మంది ఇదే తరహాలో రెండేళ్లకు మించి జైలు శిక్ష పడినప్పుడు తమ ప్రజాప్రతినిధి పదవులను కోల్పోగా, రాహుల్ విషయంలో మాత్రం ఎందుకు రభస జరుగుతోంది. చట్టం అందరికీ ఒక విధంగా రాహుల్ కు ఒక విధంగా వర్తించాలని వారందరూ కోరుకుంటున్నారా? ప్రతిపక్షాలు చేస్తున్న రభస చూస్తోంటే అలాగే అనిపిస్తోంది. 

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్ష సబబు కాదు అనే అభిప్రాయం ఎవరికైనా ఉండొచ్చు. కానీ మన ప్రజాస్వామిక దేశంలో ఆ తీర్పు ఫైనల్ కాదు. ఆ తీర్పు మీద అప్పీలు చేసుకోవడానికి సూరత్ కోర్టు రాహుల్ కు వెసులుబాటు కూడా ఇచ్చింది. ఆయన అప్పీలు చేసుకోకపోతే మాత్రమే జైలుశిక్షకు సంబంధించిన చర్యలు ఉంటాయి. 

రాహుల్ పైకోర్టులో అప్పీలు చేసుకుంటే నిజానిజాలు తేలడానికి కొంత ఆలస్యం జరగవచ్చునేమో గానీ.. ఆయనకు సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే రావడం అనేది చిటికెలో పని. ముందు స్టే వస్తే చాలు.. ఆయన ఎంపీ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. స్టే వచ్చినప్పుడు.. ఆయన అనర్హత అనేది వర్తించదు. తిరిగి ఆయన ఎంపీగా పార్లమెంటులో తన గళాన్ని ఇంకా ఘాటుగా వినిపించడానికి అవకాశం ఉంటుంది. 

కానీ రాహుల్ ఇప్పటిదాకా అప్పీలు చేసుకోలేదు. బహుశా అప్పీలు చేసుకోవడానికి సూరత్ కోర్టు ఇచ్చిన తుది గడువురోజు వరకు ఆయన దీనిని సాగతీయవచ్చు. ఆ సమయంలో పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చు. ఈ ‘అనర్హత వేటు’ అనే ఎపిసోడ్ ను తనివితీరా కొన్ని వారాలపాటు ఆస్వాదించాలని రాహుల్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.  

రాహుల్ పై అనర్హత వేటు అనేది భూతద్దంలో చూపిస్తూ బిజెపి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చాలా పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. బిజెపి ప్రతి వ్యవహారాన్ని సజావుగా, సచ్ఛీలతతో నడిపిస్తున్నదని అనడం కాదు ఇది. కానీ.. అప్పీలు కు వెళ్లి సూరత్ కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకునే అవకాశాన్ని వాడుకోకుండా రాజకీయం చేయడం మాత్రం డ్రామాలాగా కనిపిస్తోంది.