వివేక హ‌త్య కేసు.. సామాన్యుల్లాగానే కోర్టు కూడా!

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌నాలు ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసు విచార‌ణ దాదాపు నాలుగేళ్లుగా సాగుతూ ఉంది. సీబీఐ విచార‌ణ కూడా దీర్ఘ‌కాలంగానే సాగుతూ…

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌లో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌నాలు ఆస‌క్తిదాయ‌కంగా ఉన్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసు విచార‌ణ దాదాపు నాలుగేళ్లుగా సాగుతూ ఉంది. సీబీఐ విచార‌ణ కూడా దీర్ఘ‌కాలంగానే సాగుతూ ఉంది! అయితే ఈ కేసును ఇంకెన్నాళ్లు విచారిస్తారు? అనేది కేవ‌లం సామాన్యుల సందేహ‌మే కాదు, స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికీ ఇదే సందేహం వ‌చ్చింది.

2019, 2020, 2021, 2022 ల‌లో ఏమేం జ‌రిగిందో చెబుతున్నారు త‌ప్ప‌.. ధ‌ర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతోందో చెప్ప‌డం లేదంటూ సీబీఐ పై న్యాయ‌స్థానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా ప‌త్రికా క‌థ‌నాలు చెబుతున్నాయి. 

ఈ కేసులో సీబీఐ విచార‌ణ గురించి తెలుగు ప‌త్రిక‌ల్లో లెక్క‌కు మించిన క‌థ‌నాలు వ‌చ్చాయి. వ‌స్తూనే ఉన్నాయి! సీబీఐ అధికారులు ఎప్పుడు పులివెందుల వైపు వెళ్లినా, క‌డ‌ప‌కు వెళ్లినా.. అదిగో, ఇదిగో.. అంటూ ప‌చ్చ‌మీడియా ఉత్సాహ‌వంతంగా క‌థ‌నాల‌ను రాస్తూనే ఉంది. ఏం చేసినా కీల‌క ఆధారాలు ల‌భ్యం, కీల‌క విష‌యాలు తెలిశాయి.. అంటూ రొటీన్ క‌థ‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ఈ మ‌ధ్య స‌రిగ్గా ఏపీలో గ్రాజుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ కు వారం రోజుల ముందు క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయ‌బోతోదంటూ విప‌రీత ప్ర‌చారం జ‌రిగింది. స‌రిగ్గా పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు అవినాష్ – వివేక హ‌త్య‌- సీబీఐ విచార‌ణ‌.. ఇదంతా ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచింది. గ‌మ‌నిస్తే.. పోలింగ్ పూర్త‌యిన మ‌రుస‌టి రోజు నుంచి ఆ వార్త‌లు ప‌తాక శీర్షిక‌ల్లో లేవు! అస‌లు ఏ పేజీలోనూ ఆ వార్తల్లేవు!

ఈ అంశం గురించినే ఒక విశ్లేష‌కుడు స్పందిస్తూ.. ఏడాదిగా వైఎస్ భాస్క‌ర రెడ్డిని విచారించ‌లేదు, స‌రిగ్గా పోలింగ్ కు కొన్ని గంట‌ల బాగా హ‌డావుడి సాగింద‌ని ప్ర‌స్తావించారు! ఇందుమూలంగా సామాన్యులు ఏం అర్థం చేసుకోవాలి?

ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే.. దారుణంగా హ‌త్య‌కు గురైతే, చంపిన వారు నాలుగేళ్లుగా క‌స్ట‌డీలోనే ఉండ‌గా.. విచార‌ణ మాత్రం ఎందుకు యేళ్ల‌కు ఏళ్లు సాగుతుందో సామాన్యుల‌కు అర్థం కాదు. యేళ్ల‌కు యేళ్లు సాగే ఈ విచార‌ణ‌ కొన్ని ప‌త్రిక‌లే ద‌గ్గ‌రుండి చేస్తున్న‌ట్టుగా చేస్తున్న‌ట్టుగా బిల్డ‌ప్ ఇస్తూ ఉన్నాయి కూడా! ఇలా వివేక హ‌త్య కేసులో విచార‌ణ వైనం పై గ‌మ‌నిస్తున్న సామాన్యుల‌కు క‌లుగుతున్న సందేహాలే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికీ క‌లిగిన‌ట్టుగా ఉన్నాయి!