దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల కోటాలో, మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ స్థానాలకు నామినేషన్లకు ఈ నెల 31వ తేదీ చివరి రోజు. ఈ మొత్తం స్థానాల్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు, తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు నామినేట్ కావాల్సి ఉంది.
అసెంబ్లీల్లో బలాబలాల ప్రకారం.. ఏపీ నుంచి అక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కు నాలుగు సీట్లూ దక్కుతాయి. తెలంగాణలోని రెండు స్థానాలూ టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. ఈ అయితే అభ్యర్థిత్వాల విషయంలో ఈ రెండు పార్టీలూ గుంభనంగా ఉండటం విశేషం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవలే పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న వి. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం ఉండవచ్చు. ఇక మిగిలిన మూడు స్థానాల విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఆదానీ భార్య, మై హోం రామేశ్వరరావు వంటి పేర్లు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ వారికి ఆ సీట్లు ఖరారు అయినా.. మరో స్థానాన్ని జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. అంచనాలకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాల ఎంపిక ఉండవచ్చని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక టీఆర్ఎస్ తరఫున కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది మరో ఆసక్తిదాయకమైన అంశం. ఇప్పటికే టీఆర్ఎస్ కు దూరం అయిన డీ శ్రీనివాస్ స్థానంలో ఒకరిని, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో మరొకరిని కేసీఆర్ ఎంపిక చేయాల్సి ఉంది.
ఏపీలో అయినా, తెలంగాణలో అయినా అధికార పార్టీల్లోని నేతలంతా పదవుల్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు, ఇంకా అనేక ఎమ్మెల్సీ సీట్లు, ఇంకా వివిధ రకాల చైర్మన్ పదవులు, సలహాదారు పదవులు.. ఇలా నేతలంతా ఏదో ఒక హోదాల్లో ఉన్నారు. దీంతో రాజ్యసభ కావాలంటూ పట్టుబట్టే వారు లేనట్టే.
పదవంటూ ఉందంటే ఎవరో ఒకరు ఆశించే వారు ఉండనే ఉంటారు. అయితే.. కచ్చితంగా నామినేట్ చేయాల్సిందే అనే పోటీ మాత్రం లేదు. దీంతో.. ధీమాగా నిర్ణయం తీసుకోవడానికి మరింత అవకాశం ఏర్పడింది.