ఓటమి చాలా గుణపాఠాలు నేర్పుతుంది. లోపాలను సరిదిద్దుకునేలా చేస్తుంది. ప్రజానాడిని ఓటమి మాత్రమే వెల్లడిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఓటమిని అర్థం చేసుకుంటేనే భవిష్యత్ ఉంటుంది. ఒక్కోసారి గెలుపు అహంకారాన్ని పెంచుతుంది. ఏం చేస్తున్నామో తెలుసుకోలేని అజ్ఞానంలో ముంచుతుంది.
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి 1989 మొదలుకుని 2019 వరకూ వరుసగా ఏడుసార్లు గెలుపొందిన చంద్రబాబుకు ఏనాడూ అక్కడ సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన కలిగించలేదు.
కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని కుప్పం మున్సిపాలిటీ, పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఇది కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబుకు తీవ్ర అవమానం మిగిల్చింది.
కుప్పం ప్రజానీకం మనసుల్లో తనపై అభిమానం చేజారుతుందన్న సంకేతాల్ని పసిగట్టిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో తాను కుప్పం వాడినే అని, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చంద్రబాబు చెప్పుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఏమంటున్నారంటే…
‘నేను స్థానికుడినే. కుప్పంలో ఇల్లు కడతాను. దానికోసం రెండెకరాలు స్థలం కొన్నా. త్వరలోనే ఇంటినిర్మాణం చేపడతా. నన్ను కుప్పం నుంచి వేరు చేసే శక్తి ఎవరికీ లేదు’ అని అంటున్నారు. గత మూడు దశాబ్దాలకు పైగా అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు ఏనాడూ కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన రాకపోవడం విచిత్రం.
ఇప్పుడు మాత్రం తనను కుప్పం నుంచి ఎవరూ వేరు చేయలేరని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కుప్పంలో ఇల్లు కట్టుకునేలా చేసిన ఘనత మాత్రం జగన్‌కే దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఓ ఇంటివాడిని జగన్ చేస్తున్నారన్న మాట.