రవాణాశాఖ హెచ్చరికతో ఏపీ సర్కార్ షాక్‌కు గురైంది. ఇంత కాలం ఆర్థిక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం, కాగ్ మాత్రమే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం చూశాం. తాజాగా ప్రభుత్వంలో భాగమైన రవాణాశాఖ లేఖతో సర్కార్ ఖంగుతిన్నది. మూడేళ్లుగా చెల్లించకపోవడంతో పేరుకుపోయిన బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది.
బకాయిలు చెల్లించాలని కోరవడం వరకే పరిమితమై వుంటే పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని శాఖలకూ ప్రభుత్వం బిల్లులను పెండింగ్‌లో పెడుతోంది. కానీ రవాణాశాఖ ఏపీ సర్కార్‌ను హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు విషయం ఏంటంటే…
సీఎం, వీఐపీల కాన్వాయ్‌ల కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రవాణాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. మూడేళ్లలో చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ బిల్లు అక్షరాలా రూ.17.5 కోట్లు. బిల్లుల కోసం ప్రభుత్వానికి పదేపదే విన్నవించి రవాణాశాఖ అధికారులు విసిగిపోయారు.
ఈ నేపథ్యంలో పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించని పక్షంలో సీఎం, ముఖ్య నేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని రవాణాశాఖ తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని రవాణా మంత్రి విశ్వరూప్ దృష్టికి కూడా రవాణాశాఖ అధికారులు తీసుకెళ్లారు.
ఇటీవల ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ కోసం తిరుమలకు కుటుంబంతో కలిసి వెళుతున్న భక్తుడి కారును కాన్వాయ్ కోసం రవాణాశాఖ బలవంతంగా తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది.
ప్రభుత్వం సమయానికి బడ్జెట్ విడుదల చేయకపోవడం, సొంత డబ్బు పెట్టుకోలేక జనం మీద పడుతున్నారనే వాస్తవం రవాణాశాఖ లేఖతో వెలుగులోకి వచ్చింది. త్వరలో సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్న నేపథ్యంలో కాన్వాయ్‌ల ఏర్పాటు కోసం వెంటనే బిల్లులు చెల్లించాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బిల్లులు చెల్లించని పక్షంలో రవాణాశాఖ అధికారులు అన్నంత పని చేస్తే ఏంటి పరిస్థితి? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.