వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం రాజకీయ దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణే లేదని ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి. ఇటీవల విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో, బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్‌లో గర్భిణీపై సామూహిక అత్యాచారం తదితర ఘటనలు ఏపీ సర్కార్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ ఘటనలపై వివాదాలు సమసిపోక ముందే సీఎం సొంత జిల్లాలో మరో దురాఘతం వెలుగు చూసింది.
ప్రొద్దుటూరులో దళిత బాలికపై సామూహిక అత్యాచారంపై ప్రతిపక్ష నాయకుడు నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిలదీశారు.
“అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. పదిహేనేళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన నిందితులని కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకి కల్పించే రక్షణా? గన్ కంటే ముందొస్తాడని కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ప్రచారం చేయించుకున్న జగన్ సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే..ఏదా గన్? ఎక్కడా జగన్?” అని ప్రశ్నించారు.
గతంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చే సందర్భంలో అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిధులు జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మహిళల మానప్రాణాలు కాపాడేందుకు గన్ కంటే జగన్ ముందొస్తారని చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ, లోకేశ్ విమర్శలు గుప్పించడం విశేషం.