రాముడు పాయె హనుమ వచ్చె టాంటాంటాం

ప్రధాని నరేంద్రమోడీకి ఒక్క విషయంలో మాత్రం అసామాన్యమైన తెలివితేటలు ఉంటాయి. ప్రత్యర్థులు తన మీదకు రాళ్లు విసిరినా సరే.. వాటిని ఏరుకుని తన చుట్టూ దుర్గంగా నిర్మించుకోవడం ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు తన మీద…

ప్రధాని నరేంద్రమోడీకి ఒక్క విషయంలో మాత్రం అసామాన్యమైన తెలివితేటలు ఉంటాయి. ప్రత్యర్థులు తన మీదకు రాళ్లు విసిరినా సరే.. వాటిని ఏరుకుని తన చుట్టూ దుర్గంగా నిర్మించుకోవడం ఆయనకు తెలుసు. ప్రత్యర్థులు తన మీద బురద చల్లినా సరే.. ఆ మరకలను ఆధునిక మోడర్న్ పెయింటింగ్ డిజైన్ గా ప్రజలను భ్రమింపజేసి విర్రవీగడమూ ఆయనకు తెలుసు.

తన మీద పడ్డ నిందలనే.. తన ప్రచార అస్త్రాలుగా వాడుకుని వాటిద్వారానే ప్రజల సానుభూతి సంపాదించి.. ఆ సానుభూతిని ఓట్లుగా మలచుకోవడం కూడా ఆయనకు తెలుసు. అలాంటి మోడీకి ఇప్పుడు కర్నాటక ఎన్నికల్లో బజరంగదళ్ అంశం అనేది లడ్డూ లాగా దొరికింది. ఆయన చేతికి కాంగ్రెస్ పార్టీ స్వయంగా  ఒక బ్రహ్మాస్త్రం వంటి ప్రచార అంశాన్ని అందించినట్లుగా అయింది. 

భారతీయ జనతా పార్టీ అనేది మతం మీద ఆధారపడి, మతాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో కూడగట్టుకోగల భావోద్వేగాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న పార్టీ అనే సంగతి అందరికీ తెలుసు. రాముడిని తమ ట్రంపు కార్డులాగా వాడుకుంటూ ఆ పార్టీ ఇన్నాళ్లూ మనుగడ సాగించింది.

అయోధ్య రామాలయం అనేది ఆ పార్టీకి ప్రతి ఎన్నికల్లోనూ ఒక అస్త్రంగా ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ రోజులు గతించిపోయాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణం కూడా జరిగిపోతోంది. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో మహా అయితే ఆ రామాలయాన్ని పూర్తిచేసి చివరిసారిగా ఎన్నికల్లో ఓట్లకోసం వాడుకోవడం బిజెపికి సాద్యం కావచ్చు. 

ఈలోగా వచ్చిన కర్నాటక ఎన్నికల్లో వారికి మతం అస్త్రంలేదుకదా అనుకుంటుండగా.. కాంగ్రెస్ స్వయంగా బజరంగదళ్ అస్త్రాన్ని అందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భజరంగదళ్ ను నిషేధిస్తామని ప్రకటించింది. మతమౌఢ్యానికి, హిందూత్వ తీవ్రవాదానికి పెట్టింది పేరైన భజరంగదళ్ విషయంలో అలాంటి హామీ ఇవ్వడం ద్వారా ముస్లిం వర్గాల్లో  ఓటు బ్యాంకును కొల్లగొట్టవచ్చునని కాంగ్రెస్ కూడా చీప్ పాలిటిక్స్ ప్లే చేసింది. అయితే ఆ ప్రకటనను మోడీ విస్తృతంగా వాడుతున్నారు.

‘‘హనుమంతుడు అంటే మీకు ఎందుకంత ద్వేషం? నిన్నటిదాకా రాముడిని ద్వేషించారు? ఇప్పుడు హనుమంతుడిని ద్వేషిస్తారా’’ అంటూ మోడీ మాట్లాడుతున్నారు. ఆ మాటల ద్వారా.. ‘నిన్నటిదాకా మేం రాముడిని వాడుకున్నాం, ఇవాళ హనుమంతుడిని వాడుకుంటున్నాం’ అని ధ్వనింపజేస్తున్నారు. అక్కడికేదో భజరంగదళ్ అనే అతివాద సంస్థకు హనుమంతుడు అనే రామభక్తుడు ఫౌండర్ ప్రెసిడెంట్ అయినట్టుగా మోడీ మాటలు ఉంటున్నాయి. దేశప్రధానిగా అత్యుున్నత హోదాలో ఉంటూ.. ఈ మత రాజకీయాల మాటలు చూపరులకు ఏవగింపు కలిగిస్తున్నాయి.