Advertisement

Advertisement


Home > Politics - National

సభలకు ఎంత ఖర్చు అంటే?

సభలకు ఎంత ఖర్చు అంటే?

తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వైకాపా కావచ్చు. ఎవరు సభ నిర్వహించినా కోట్ల ఖర్చు. అయితే ఈ కోట్లు మొత్తం పార్టీనే భరించదు. ఎన్నికల టైమ్ కనుక అభ్యర్థులు, నాయకులు, టికెట్ లు ఆశించేవారు, పార్టీ అధికారంలోకి వస్తే పనులు జరిపించుకోవచ్చు అనుకునేవారు అంతా తలా కొంచెం భరించాల్సిందే. పల్లెటూళ్లు, మండల కేంద్రాలు, పట్టణాలు ఇలా ఒక్కో ఏరియా నుంచి ఇన్ని వాహనాలు అని ముందే కేటాయింపు చేస్తున్నారు.

ప్రతి పల్లెటూరికి కనీసం అయిదు వాహనాలు అవసరం పడతాయి. ప్రతి వాహనానికి అయిదుగురు జనాలు అవసరం పడతారు. మనిషికి 500 చేతి ఖర్చుకు ఇవ్వాలి. మూడు పూటల తిండి పెట్టాలి. మందు ఇవ్వాలి. మూడు పూటల్లో ఒక పూట నాన్ వెజ్ వుండాలి. ఇది కాక వాహనానికి డ్రైవర్ బేటా, ఇంధనం ఖర్చు. ఇవన్నీ కలిసి 15 వేల నుంచి 20 వేల వరకు ఒక వాహనానికి అవసరం పడుతుంది. వాహనం కిరాయి 2500 నుంచి 3500 ఇవ్వాల్సి వుంటుంది. అంటే ఒక పల్లెటూరు నుంచి కనీసం పాతిక మందిని ఓ సభ కు తరలించాలి అంటే ఎంత ఖర్చు అన్నది అంచనా వేసుకోవాల్సిందే.

అలాంటిది ఒక నియోజకవర్గం నుంచి సిద్దం సభకో, తాడేపల్లి గూడెం సభకో జనాల్ని తరలించారు అంటే ఎన్ని కోట్ల ఖర్చు అయి వుంటుంది. పారిశ్రామికవేత్తలు, పార్టీ నాయకులు, టికెట్ ఆశించేవారికి కోటా విధిస్తున్నారు. ఒక కారు పెట్టు అనే ఆదేశం నుంచి యాభై కార్లు పెట్టండి అనే వరకు. పారిశ్రామిక వేత్తలు అయితే ట్రావెల్స్ తో మాట్లాడి కార్లు అరేంజ్ చేసి అప్పగించేస్తున్నారు. అక్కడి నుంచి మిగిలిన ఖర్చు టికెట్ వచ్చిన వాళ్లో, ఆశిస్తున్న వాళ్లో పెట్టుకుంటున్నారు.

కొందరు పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే టికెట్ వచ్చిన వారికి రెండేసి కార్లు అందించేసారు. నియోజకవర్గంలో ఎంత తిరిగినా ఖర్చు ఆ పారిశ్రామిక వేత్తలదే. ఇలా రియల్ ఎస్టేట్ జనాలు, పారిశ్రామిక వేత్తలు తలా కొన్ని కార్లు సమకూర్చుడంతో అభ్యర్థికి చేతి ఖర్చు కాస్త తగ్గుతుందన్నమాట.

మొత్తం మీద ఎన్నికల పుణ్యమా అని లిక్కర్ సేల్స్, డీజిల్ సేల్స్ బాగానే పెరిగింది ఇప్పటికే. డబ్బులు కూడా ఇప్పుడిప్పుడే చలామణీలోకి రావడం మొదలైంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?