ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు.. జ‌గ‌న్ మేల్కొంటేనే!

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వ‌ర్గ రాజ‌కీయాలు తీవ్ర‌మ‌య్యాయి. వైసీపీ పెద్ద‌లు విజ‌య‌సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సూళ్లూరుపేట వైసీపీలో విభేదాల‌ను పోగొట్టేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. అక్క‌డ సిటింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌ను…

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వ‌ర్గ రాజ‌కీయాలు తీవ్ర‌మ‌య్యాయి. వైసీపీ పెద్ద‌లు విజ‌య‌సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సూళ్లూరుపేట వైసీపీలో విభేదాల‌ను పోగొట్టేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. అక్క‌డ సిటింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య‌ను మారిస్తే త‌ప్ప‌, వైసీపీ బ‌తికి బ‌ట్ట క‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవ‌య్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేత‌ల‌పై స్వారీ చేశారు.

కేసులు పెట్టించి , పోలీసుల‌తో చావు దెబ్బ‌లు కొట్టించారు. అలాగే సొంత పార్టీ నేత‌ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు న‌మోదు చేయించి జీవితాల‌తో ఆడుకున్నారనే విమ‌ర్శ వుంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా ఆయ‌న‌కు సొంత పార్టీలోనే శ‌త్రువులు పెరిగారు. ఇప్పుడు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌యం వ‌చ్చింది. సంజీవ‌య్య‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. స‌ర్వేల్లో సంజీవ‌య్య‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు తెలిసింది.

అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్రాథేయ ప‌డ‌డంతో ఆయ‌న మ‌న‌సు క‌రిగింద‌ని అంటున్నారు. సంజీవ‌య్య‌కే టికెట్ అని విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌ల ప్ర‌క‌టించి, అగ్గికి ఆజ్యం పోశారు. సంజీవ‌య్య అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకిస్తున్న వైసీపీ నాయ‌కులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌నకు మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. వైసీపీలో వ‌ర్గ విభేదాల‌ను రాజ‌కీయంగా సొమ్ము చేసుకోడానికి టీడీపీ పావులు క‌దిపింది.

నాయుడుపేట మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ర‌ఫీ ఇటీవ‌ల చంద్ర‌బాబు సమ‌క్షంలో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి టీడీపీలో చేరారు. అలాగే మ‌రి కొంద‌రు టీడీపీలో చేర‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. సూళ్లూరుపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ శ్రీ‌మంత్‌రెడ్డి వైసీపీలో వుంటూనే, సంజీవ‌య్య‌కు మాత్రం మ‌ద్ద‌తు ఇచ్చే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పారు. అలాగే క‌ళ‌త్తూరు శేఖ‌ర‌రెడ్డి, క‌ట్టా సుధాక‌ర్‌రెడ్డి, రామ్మోహ‌న్‌రెడ్డి, జ‌నార్ద‌న్‌రెడ్డి త‌దిత‌రుల‌తో పాటు త‌డ మండ‌లానికి చెందిన మ‌త్స్య‌కార సంఘాల నాయ‌కులు సంజీవ‌య్యకు టికెట్ ఇస్తే, ఓడించి తీరుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇదిలా వుండ‌గా ఇక్క‌డి నుంచి మాజీ ఎంపీ నెల‌వ‌ల సుబ్ర‌మ‌ణ్యం కుమార్తె విజ‌య‌శ్రీ పోటీలో ఉండ‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సూళ్లూరుపేట‌లో వైసీపీ అభ్య‌ర్థి సంజీవ‌య్య 61 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే మూడో అతిపెద్ద మెజార్టీ కావ‌డం విశేషం. వైసీపీకి కంచుకోట అయిన సూళ్లూరుపేట‌లో అభ్య‌ర్థిని మార్చ‌క‌పోతే, ఓట‌మి ఖాయ‌మ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఇప్ప‌టికైనా సీఎం వైఎస్ జ‌గ‌న్ మేల్కొన‌క‌పోతే చేజేతులా ఒక సీటును పోగొట్టుకోవాల్సి వ‌స్తుంది.