ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. నగరి నుంచి మంత్రి ఆర్కే రోజా వరుసగా రెండు సార్లు గెలుపొందారు. టీడీపీ సీనియర్ నాయకుడైన గాలి ముద్దుకృష్ణమనాయుడిని ఓడించి మొదటిసారి ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా అధికార పార్టీ టీడీపీ నుంచి ఆమె ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నారు. అయితే ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కంటే స్వపక్షమైన వైసీపీ పెద్దల నుంచి ఆమె వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
నగరిలో ఎలాగైనా ఓడించాలని సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గాన్ని ఒక పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో రోజా వ్యతిరేక వర్గీయులంతా ఏకమై, ఆమెపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా భర్త, దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో రోజాను వ్యతిరేకిస్తున్న వాళ్లది తప్పు కాదని ఆయన అన్నారు. వారిని ప్రోత్సహిస్తున్న నేతలదే తప్పని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
సెల్వమణి మాట్లాడుతూ నమ్మిన వారికి తామెప్పుడూ ద్రోహం చేయలేదన్నారు. శ్రీశైలం పాలక మండలి చైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వాలని రోజా సిఫార్సు చేసిందని ఆయన గుర్తు చేశారు. తమ వల్లే చక్రపాణిరెడ్డికి పదవి వచ్చిందన్నారు. అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ కుటుంబానికి తామెంతో సహాయం చేశామన్నారు. వాళ్లంతా ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.
తమపై తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్లది తప్పు కాదన్నారు. వారిని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్న నేతలు తప్పు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమను విమర్శిస్తున్నారనే కారణంతో అదే పని తాము చేయడం మంచిది కాదన్నారు. దేవుడనే వాడు ఒకడున్నాడని, అంతా ఆయనే చూసుకుంటాడని సెల్వమణి హెచ్చరించారు.
గతంలో రోజా ఎమ్మెల్యేగా గెలవదన్నారని, కానీ గెలిచి చూపారన్నారు. అలాగే మంత్రి పదవి రాదన్నారని, ఆ పదవి దక్కించుకున్నారని చెప్పారు. ఈ దఫా కూడా 175 నియోజకవర్గాల్లో గెలిచే మొదటి సీటు నగరి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రోజా గెలిచిన తర్వాత తమ వ్యతిరేకులతో మాట్లాడ్తామని ఆయన స్పష్టం చేశారు.