చంద్రబాబునాయుడికి రాజకీయంగా పోయే కాలం దగ్గర పడిందనే కామెంట్స్ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దనుకున్న ప్రజాప్రతినిధుల్ని చంద్రబాబు అక్కున చేర్చుకోవడంపై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ కండువా కప్పుకోడానికి సిద్ధమయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఆయన చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. జయరాం అవినీతిపై టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కారును గిఫ్ట్‌గా జయరాం కొడుకు తీసుకున్నాడని, అది అవినీతి వాహనం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే జయరాం తమ్ముళ్ల అరాచకాలు ఆలూరు నియోజకవర్గంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆలూరు నియోజకవర్గంలో జయరాంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. ఆలూరు వైసీపీ అభ్యర్థిగా విరూపాక్షిని జగన్ ప్రకటించారు. జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆలూరులో చెడ్డపేరు తెచ్చుకున్న జయరాంను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
అయితే ఎంపీగా పోటీ చేయడానికి జయరాం నిరాకరించారు. ఎంతగా బతిమలాడినా ఆలూరు విషయంలో పునరాలోచన లేదని సీఎం స్పష్టం చేశారు. దీంతో టీడీపీకి ఆయన టచ్‌లోకి వెళ్లారు. స్థానిక నాయకత్వం వ్యతిరేకించడంతో చంద్రబాబు వెనకడుగు వేసినట్టు ప్రచారం జరిగింది. అయితే కర్నాటక కాంగ్రెస్ పెద్దల నుంచి చంద్రబాబుపై గుమ్మనూరు జయరాం ఒత్తిడి తెచ్చారని సమాచారం. దీంతో చంద్రబాబు తలొగ్గక తప్పలేదు.
ఇవాళ, రేపో చంద్రబాబు సమక్షంలో జయరాం టీడీపీలో చేరడం ఖాయమైంది. గుమ్మనూరుకు అనంతపురం జిల్లా గుంతకల్లు సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా టీడీపీ స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు చేర్చుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ చెత్తనంతా నెత్తికెత్తుకోవడం బాబు రాజకీయంగా పరాజయానికే అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు నిట్టూర్చుతున్నారు.