కమలం దీక్షలో కాంగ్రెస్ నాయకుడు!

గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి కమలదళంలో చేరాలని అనుకున్నారు. రాహుల్ సహా పెద్దలందరూ ఆయనను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా రాయబారం నడిపారు. తర్వాత అయిష్టంగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు కానీ.. రకరకాల…

గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి కమలదళంలో చేరాలని అనుకున్నారు. రాహుల్ సహా పెద్దలందరూ ఆయనను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా రాయబారం నడిపారు. తర్వాత అయిష్టంగా పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు కానీ.. రకరకాల చికాకులు సృష్టిస్తున్నారు. 

హస్తం కంటే కమలం మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్న ఈ కాంగ్రెస్ నాయకుడు… తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బిజెపి చేస్తున్న నిరసన దీక్షలో తాను కూడా పాల్గొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజస్థాన్లో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వైఖరి ఆ పార్టీకి మింగుడు పడడం లేదు.

రాజస్తాన్ లో భూవివాదం కారణంగా ఇటీవల రాంప్రసాద్ మీణా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యకు ముందు ఆయన రికార్డు చేసిన వీడియోలో రాష్ట్రప్రభుత్వంలో కేబినెట్ మంత్రి మహేష్ జోషితో పాటు మరికొందరు తనను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఆరోపణలు చేశారు. మంత్రి మీద ఆరోపణలు వచ్చినా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కించిత్తు కూడా స్పందించలేదు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ ‘ఆత్మహత్య విచారకరం’ అని లైట్ తీసుకున్నారు. పేదలు వేధింపులకు గురికాకుండా చూడాలని.. అధికారులకు ఓ ఆదేశం పడేశారు. 

వ్యవహారం అక్కడితో ముగిసిపోలేదు. బిజెపి ఎంపి కిరోడీలాల్ మీణా రాంప్రసాద్ కుటుంబానికి మద్దతుగా మూడు రోజులుగా జైపూర్ లో ధర్నా చేస్తున్నారు. బిజెపి ఈ వివాదాన్ని టేకప్ చేయడం రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం కాగా, ప్రత్యేకించి అశోక్ గహ్లోత్ కేబినెట్ లో గతంలో డిప్యూటీగా కూడా పనిచేసిన సచిన్ పైలట్.. తాను కూడా వెళ్లి వారికి మద్దతుగా ఆ దీక్షా శిబిరంలో పాల్గొనడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్ నేత కూడా బిజెపి దీక్షకు మద్దతివ్వడం వలన.. కేబినెట్ మంత్రి భూవివాదాలతో జనం మరణాలకు కారణం అవుతోంటే.. సీఎం వెనకేసుకు వస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయి. గతంలో కూడా పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేయడంలో ముందూ వెనుకా చూసుకోకుండా మాట్లాడే అలవాటు ఉన్న సచిన్ పైలట్.. తాజాగానూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.

నిజానికి రాజస్తాన్ రాజకీయాల్లో సచిన్ పైలట్ ను దూరం చేసుకునే ధైర్యం కాంగ్రెసుకు లేదు. అదే సమయంలో అశోక్ గహ్లోత్ కు సర్దిచెప్పగల వారు కూడా లేరు. ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం రాజస్తాన్ లో ఎదురైన గడ్డు పరిస్థితుల్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి.