అంటరానితనం నేరం.. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో కనిపించిన వాక్యం. మెల్లమెల్లగా అంటరానితనం గురించి మాట్లాడ్డం తగ్గిపోయింది. సాధారణ పరిస్థితులు వచ్చేశాయని సిటీ జనం అనుకునే రోజులొచ్చాయి. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అస్పృశ్యత కొనసాగుతోంది. కాకపోతే పైకి కనిపించడం లేదంతే. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పాపకాడుకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం అది. దాని పేరు కేళమంగళం. ఆ ఊరిలో హిందువులు ఇప్పటికీ అస్పృశ్యతను పాటిస్తున్నారు. హరిజనుల్ని ఇంట్లోకి రానివ్వరు. తాజాగా ఊరిలో పంచాయితీ పెట్టిమరీ దీనిపై తీర్మానం చేశారు. షెడ్యూల్ కాస్ట్-ఎస్సీకి చెందిన వ్యక్తుల్ని ఇళ్లలోకి రానివ్వకూడదని తీర్మానించుకున్నారు.
అంతేకాదు, హరిజనులకు ఆ ఊరిలో ఏ కిరాణా షాపులో సరుకులు దొరకవు. ఊరిలోని సెలూన్ లో వాళ్లకు ఎవ్వరూ కటింగ్ చేయరు. చివరికి టీ స్టాల్ లో కూడా హరిజనులకు అందరూ వాడే కప్పుల్లో టీ ఇవ్వరు. వాళ్లకు విడిగా టీ కప్పులు వాడుతున్నారు.
తాజాగా ఓ హరిజనుడు ఈ విషయాన్ని వీడియో తీసి మరీ బయట ప్రపంచానికి తెలియజేశాడు. వీరముత్తు అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులోకి వెళ్లాడు సదరు హరిజనుడు. పచారీ సామాన్లు కావాలని అడిగాడు. హరిజనులకు సరుకులు అమ్మేది లేదని సమాధానం వచ్చింది.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అధికారులు రంగంలోకి దిగారు. సరుకులు అమ్మనని చెప్పిన వీరముత్తును అరెస్ట్ చేశారు, అతడి షాపును సీజ్ చేశారు. అస్పృశ్యత నేరం అంటూ మరోసారి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎందుకైనా మంచిదని ఊరిలో పోలీసుల్ని మోహరించారు.
ఈ జాడ్యం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాదు. బిహర్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. పైకి కనిపించనప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ జాడ్యం ఇంకా ఉంది.