మరో విమానం.. మళ్లీ అదే నిర్లక్ష్యం

ప్రయాణికుల్ని గాలికొదిలేసి, విమానం గాల్లో దూసుకుపోవడం ఇప్పుడు భారత్ లో కామన్ గా మారినట్టుంది.. ఆమధ్య బెంగళూరులో గో ఫస్ట్ ఎయిర్ వేస్ సంస్థ ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికుల్లో 50మందిని ఎయిర్ పోర్ట్ లోనే…

ప్రయాణికుల్ని గాలికొదిలేసి, విమానం గాల్లో దూసుకుపోవడం ఇప్పుడు భారత్ లో కామన్ గా మారినట్టుంది.. ఆమధ్య బెంగళూరులో గో ఫస్ట్ ఎయిర్ వేస్ సంస్థ ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికుల్లో 50మందిని ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి ఎగిరిపోయింది. అది జరిగిన వారం రోజులకే సేమ్ సీన్ రిపీట్ అయింది.

ఈసారి సింగపూర్ కి చెందిన స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం 30 మందిని అమృత్ సర్ లో వదిలేసి ఎంచక్కా సింగపూర్ వెళ్లిపోయింది. దీంతో ఆ 30 మంది ఫిర్యాదు చేయడంతో డీజీసీఏ విచారణకు ఆదేశించింది. సింగపూర్ స్కూట్ ఎయిర్ లైన్స్ తో పాటు, అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ అథారిటీకి కూడా సంజాయిషీ కోరుతో నోటీసులు పంపించింది.

అసలేం జరిగిందంటే..?

280 మంది ప్రయాణికులతో అమృత్ సర్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానం అది. రాత్రి 7.55 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం కాస్తా మధ్యాహ్నం 3కే వెళ్లిపోయింది. 250 మంది మధ్యాహ్నం 3 గంటలకే అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ కి వచ్చి ఫ్లైట్ లో సింగపూర్ వెళ్లారు. 30 మంది మాత్రం ఫ్లయిట్ మిస్సయ్యారు. రాత్రి ఫ్లయిట్ మధ్యాహ్నం వెళ్లిపోతే 250 మంది ఎలా ఫ్లైట్ అందుకున్నారనేదే అసలు ప్రశ్న.

ఇక్కడ విమానయాన సంస్థ నిర్లక్ష్యంతో పాటు, ట్రావెల్ ఏజెన్సీ నిర్వాకం కూడా ఉంది. 30 మంది ప్రయాణికులు ఒకే ట్రావెల్ ఏజెన్సీ వద్ద టికెట్ బుక్ చేసుకున్నారు. ఫ్లయిట్ టైమ్ మారిన విషయాన్ని ఆ ఏజెన్సీ  ప్రయాణికులకు చెప్పలేదు. ప్రయాణికులకు వ్యక్తిగతంగా ఈ-మెయిల్స్, మెసేజ్ లు పంపించింది విమానయాన సంస్థ. ఆ 30మంది టికెట్ బుకింగ్ సమయంలో ట్రావెల్ ఏజెన్సీ కి చెందిన ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీ ఇవ్వడం వల్ల ఆ సమాచారం వారికి వెళ్లలేదు. దీంతో వారంతా ఫ్లయిట్ మిస్సయ్యారు.

బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన గో ఫస్ట్ ఎయిర్ వేస్ 50మందిని విడచిపెట్టి వెళ్లినందుకు ఇటీవల క్షమాపణలు కోరింది, వారికి ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు సింగపూర్ స్కూట్ ఎయిర్ లైన్స్ కూడా తప్పు ఒప్పుకుంది. ట్రావెల్ ఏజెన్సీ వల్లే తప్పు జరిగిందని అంటున్నా.. తమ బాధ్యతారాహిత్యానికి క్షమాపణ కోరింది. బాధిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.