రాజద్రోహం కేసుల నమోదుపై కేంద్ర ప్రభుత్వ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. రాజద్రోహం చట్టం (124ఎ) ఉండాలనే రీతిలో కేంద్ర ప్రభుత్వం రకరకాల ఉదాహరణలతో వాదించిన, సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రాజద్రోహం చట్టం (124ఎ) అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
రాజద్రోహం చట్టాన్ని అడ్డు పెట్టుకొని దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెడుతున్నాయనే విమర్శలున్నాయి. బ్రిటీషర్ల హయాంలో తీసుకొచ్చిన చట్టం, వలసపాలకులు పోయినా, ఇంకా దాన్ని కొనసాగించడంపై ఆలోచించాలని కొంత కాలంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ వచ్చింది. మరోవైపు రాజద్రోహం కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజద్రోహం చట్టంపై సమీక్ష పూర్తయ్యే వరకూ దాని పరిధి కింద కేసులు నమోదు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. సమీక్ష పూర్తయ్యేంత వరకూ కేసులు నమోదు చేయొద్దని ఆదేశించడం సరైందని కాదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
తీవ్రమైన నేరాల్లో రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయకుండా ఉండలేమని స్పష్టం చేయడం గమనార్హం. ఎలాంటి నేరాల్లో రాజద్రోహం కింద కేసులు నమోదు చేయవచ్చో నిర్ణయించేందుకు ఓ అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఎస్పీ ర్యాంక్ అధికారి విచారించి, ఓకే అంటేనే రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసేలా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ వాదనతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించలేదు. చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. మరోవైపు పిటిషనర్లు మాత్రం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వాపోతున్నారన్నారు. హనుమాన్ చాలిసా పఠించినా రాజద్రోహం అభియోగాలు మోపుతున్నారని అటార్నీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారన్నారు.
ఈ పరిస్థితుల్లో సమీక్ష పూర్తయ్యేంత వరకూ రాజద్రోహం చట్టాన్ని ఉపయోగించడం సరైంది కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజద్రోహం చట్టంపై పునఃపరిశీలన పూర్తయ్యే వరకూ స్టే విధిస్తున్నామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేయడంతో కేంద్రప్రభుత్వం షాక్కు గురైంది.