మహమ్మారి మనల్ని ఇంకా వదిలి వెళ్లలేదు. మహమ్మారి మన చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉందన్న చేదు నిజాన్ని యువ హీరో రామ్‌చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల బయట పెట్టారు. తానే మహమ్మారి బాధితురాలు కావడం గమనార్హం. మహమ్మారి బారిన పడి, ప్రస్తుతం కోలుకున్న విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సామాజిక అంశాలపై తనవైన అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా ఉపాసన పంచుకునే విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ఫస్ట్ వేవ్‌లో మహమ్మారి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఒకవేళ దాని బారిన పడితే ఎలాంటి మందులు వాడలో ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ఫస్ట్, సెకెండ్, థర్డ్ వేవ్‌లు వెళ్లిపోయాయి. థర్డ్ వేవ్‌లో పెద్దగా ప్రాణాపాయం లేకపోయింది.
అది పూర్తిగా మాయమైందని భావిస్తున్న తరుణంలో ఉపాసన షాకింగ్ న్యూస్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇవాళ ఆమె రాసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా బారిన పడిన విషయం ఎలా బయటపడిందో ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే అసలు ఆ మహమ్మారి ఉనికే బయట పడేది కాదని ఉపాసన చెప్పడం విశేషం. ఉపాసన పోస్టు సంగతేంటో చూద్దాం.
“గత వారం నేను కోవిడ్‌బారిన పడ్డాను. వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. కేవలం పారా సిటిమాల్, విటమిన్ మందులు మాత్రమే వైద్యులు వాడమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం కోవిడ్ నుంచి కోలుకున్నా. మళ్లీ జీవితాన్ని అన్ని విధాలుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యాను. మానసికంగా, శారీరకంగా ధైర్యంగా వున్నాను.
కోవిడ్ మళ్లీ పంజా విసురుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. మన జాగ్రత్తల్లో మనం వుండడం, సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యం. చెన్నైలో వున్న మా తాతయ్య దగ్గరికి వెళ్లాలనుకుని పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే ఎవరికీ తెలిసేది కాదు” అని ఉపాసన రాశారు.
ఉపాసన చెప్పినట్టు వైద్య పరీక్షలు చేయించుకోకుండా, అసలు మహమ్మారి బారిన పడ్డామనే విషయమే తెలియకుండా ఎంత మంది ఉన్నారో అనే చర్చకు తెరలేచింది.