మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి (ఎల్‌సీవీ గౌరి)ని జడ్జి కాకుండా అడ్డుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. న్యాయవాది అయిన ఆమెను మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో జడ్జిగా ఆమె నియామకం సరైంది కాదంటూ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మద్రాస్ బార్ కౌన్సిల్ మెంబర్స్ పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం విచారించే కేసుల్లో గౌరి కేంద్రం తరఫున వాదించారు. దీంతో బీజేపీతో గౌరికి రాజకీయ సంబంధాలున్నాయని, క్రిస్ట్రియన్లు, ముస్లింలపై విద్వేష ప్రసంగాలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మద్రాస్ హైకోర్టు అడిషనల్ జడ్జి పదవికి ఆమె పేరు సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో వెంటనే విచారణ చేపట్టింది.
విచారంచిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. పిటిషన్‌ను కొట్టి వేస్తూ, ఆమె జడ్జి నియామకాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఆమె అనర్హతకు సంబంధించి సరైన కారణాలను చూపలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలేవీ గౌరి అర్హతలకు సంబంధించినవి కాదని స్పష్టం చేసింది.
ఆమె అనుకూలతలకు సంబంధించి మాత్రమే పిటిషన్‌లో పేర్కొన్నారని ధర్మాసనం ప్రస్తావించింది. అర్హతలకు, అనుకూలతలకు చాలా తేడా వుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తిగా గౌరి ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమెను అదనపు న్యాయమూర్తిగా మాత్రమే నియమించారని ధర్మాసనం తెలిపింది. పనితీరు సంతృప్తికరంగా లేకపోతే న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేయని సందర్భాలు ఎన్నో వున్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
ఇదిలా వుండగా సుప్రీంలో కేసు విచారణ జరగుతుండగానే లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయడం విశేషం.