నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరల్ని అధికార పార్టీ వైసీపీ పీకింది. తమను ధిక్కరించి వెళ్లిన కోటంరెడ్డికి అంత సీన్ లేదని చెప్పేందుకు వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. నెల్లూరు రూరల్ ఇన్చార్జ్గా ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియామకంతో కోటంరెడ్డికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. నెల్లూరు రూరల్‌లో కార్పొరేటర్లంతా తన వెంట నిలుస్తారని ఆయన భావించారు. అయితే అంత సీన్ లేదని చాలా త్వరగానే ఆయనకు అధికార పార్టీ తెలియజెప్పింది.
నెల్లూరు రూరల్‌లో మొత్తం 28 డివిజన్లున్నాయి. ఇవాళ నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తన కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 17 మంది ఆయన వద్దకు వచ్చి మద్దతు పలికారు. మరో ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు ఆయనకు సమాచారం ఇచ్చారని తెలిసింది. నెల్లూరు మేయర్ స్రవంతి రూరల్ పరిధిలోని డివిజన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కోటంరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. మేయర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అను కూలంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిని రాజకీయంగా ఒంటరి చేయడంలో వైసీపీ సక్సెస్ సాధించింది.
ఒకప్పుడు జగన్ కూడా ఒంటరిగానే ప్రస్థానం మొదలు పెట్టారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతానని కోటంరెడ్డి చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌లో రానున్న రోజుల్లో రాజకీయం రంజుగా మారనుంది. కోటంరెడ్డిని కట్టడి చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదని వైసీపీ గట్టి పట్టుదలతో వుంది.