ఇండియా అబ్బాయి, ఫారిన్ అమ్మాయి పెళ్లి. ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు కామన్. ఇరు కుటుంబాలు అంగీకరించి మరీ ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లో జరిగిన వివాహం చాలా విచిత్రమైనది. అబ్బాయి ఫారిన్ వెళ్లలేదు, అమ్మాయి ఇండియాకి రాలేదు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దానికి కారణం ఫేస్ బుక్.
అమ్మాయి స్వీడిష్ యువతి. పేరు క్రిస్టెన్ లీబర్డ్. కార్పొరేట్ బిజినెస్ కోచ్ గా అక్కడ పేరున్న కంపెనీలో ఉద్యోగం చేసేది. పెళ్లి కొడుకు పవన్ కుమార్ ఉత్తరప్రదేశ్ లోని ఎటా వాసి. డెహ్రాడూన్ లో బీటెక్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2012లో ఫేస్ బుక్ ద్వారా వీరి ప్రేమ చిగురించింది. అదిప్పుడు మొగ్గ తొడిగి వికసించి పెళ్లి జరిగింది.
ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ సహోద్యోగులతోనో, లేక మనసుకి నచ్చినవారితోనో ప్రేమలో పడటం, భారత్ కి తిరిగొచ్చి ఇక్కడ మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రేమకథలో మాత్రం పవన్ కుమార్ ఎక్కడికీ వెళ్లలేదు. పెళ్లి కూతురే 6 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వీడన్ నుంచి ఉత్తర ప్రదేశ్ కి వచ్చింది. భారతీయ సంప్రదాయం ప్రకారం వారిద్దరి వివాహం జరిగింది.
అమ్మాయి కుటుంబ సభ్యులెవరూ ఈ వివాహానికి హాజరు కాలేదు. అబ్బాయి తల్లిదండ్రులు క్రిస్టెన్ లీబర్ట్ ని తమ కోడలిగా అంగీకరించారు. దగ్గరుండి ఓ స్కూల్ లో పెళ్లి మండపం ఏర్పాటు చేసి పెళ్లి చేశారు. పిల్లల ఆనందంలోనే తల్లిదండ్రుల సంతోషం దాగి ఉందని, అందుకే తాము ఈ పెళ్లికి అంగీకరించామని అంటున్నాడు పవన్ తండ్రి గీతా సింగ్. భారతీయ యువకుడితో స్వీడిష్ యువతి పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.