ఆడ-ఆడ, మగ-మగ.. పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది..? వారి వివాహానికి రిజిస్ట్రేషన్ ఉంటుందా..? వారిని దంపతులుగా ప్రభుత్వం గుర్తిస్తుందా..? వారిని కుటుంబంగా గుర్తిస్తూ ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఇస్తాయా..? ఇలాంటివాటన్నిటికీ త్వరలో సమాధానం దొరుకుతుంది. సుప్రీంకోర్టు ఈ కేసులన్నిటిపై త్వరలోనే స్పష్టమైన తీర్పు ఇవ్వబోతోంది.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు కూడా తమ దగ్గరకు వచ్చిన ఇలాంటి పిటిషన్లు అన్నింటినీ సుప్రీంకోర్టుకి బదిలీ చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో తమకు న్యాయం కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కే ఎవరైనా సుప్రీంలో తేల్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది.
ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం ఇలాంటివి 8 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అభిజిత్ అయ్యర్ మిత్రా, మరో ముగ్గురు కలసి ఒక పిటిషన్ వేశారు. సేమ్ సెక్స్ పెళ్లిళ్లని ప్రభుత్వం గుర్తించడం లేదని, దీనిపై ప్రభుత్వానికి మార్గదర్శకాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టుని కోరారు. హిందూ వివాహ చట్టం, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తమకు న్యాయం చేయాలన్నారు.
మరో పిటిషన్ లో ఇద్దరు మహిళలు తమని దంపతులుగా గుర్తించాలని, తమ వివాహానికి చట్టబద్ధత కావాలని కోరారు. ఇంకో పిటిషన్లో ఇద్దరు యువకులు తమకు న్యాయం చేయాలన్నారు. తామిద్దరం అమెరికాలో పెళ్లి చేసుకున్నామని, భారత్ లో కూడా తమ వివాహం చట్టబద్ధం అన్నట్టుగా సర్టిఫికెట్ కావాలన్నారు. ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తమ పెళ్లికి చట్టబద్ధత కావాలని కోరారు.
ఈ కేసులన్నిటినీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకి బదిలీ చేసింది. ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తో కూడిన ధర్మాసనం వీటిని సుప్రీంకు ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
భారత్ లో హోమో సెక్స్ అనేది నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. అప్పటినుంచి చాటుమాటుగా సహజీవనం చేసే మగ-మగ, ఆడ-ఆడ జంటలు ఆ తీర్పు తర్వాత కాస్త ధైర్యం తెచ్చుకున్నాయి. బహిరంగంగానే తామిద్దరం దంపతులం అని చెప్పుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటవుతున్నారు. వివాహాలు కూడా చేసుకుంటున్నారు.
అయితే ఇద్దరు పురుషులు, లేదా ఇద్దరు మహిళలు వివాహం చేసుకునే విషయంలో మాత్రం సుప్రీం జోక్యం చేసుకోలేదు. వీరి వివాహాలు చట్టబద్ధమేనా అనే ప్రశ్నకు మాత్రం ఇంకా చట్టబద్ధమైన జవాబు దొరకలేదు. భారత ప్రభుత్వం ఇలాంటి వివాహాలను గుర్తించడం లేదు. మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. కానీ ఇప్పుడు కొంతమంది తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ కోర్టు మెట్లెక్కారు. ఒక్క ఢిల్లీ హైకోర్టులోనే ఇలాంటి పిటిషన్లు 8 పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ సుప్రీంకు ట్రాన్స్ ఫర్ చేసింది ఢిల్లీ హైకోర్టు.