కోడి కూర పెట్టి కోట్ల రూపాయలు కొట్టేసింది

మోసాల్లో వేల రకాలు. రోజుకో కొత్త మోసం పుట్టుకొస్తోంది. మనం ఎంత నమ్మితే అంత మోసపోవడం ఖాయం. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ కిలాడీ,…

మోసాల్లో వేల రకాలు. రోజుకో కొత్త మోసం పుట్టుకొస్తోంది. మనం ఎంత నమ్మితే అంత మోసపోవడం ఖాయం. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ కిలాడీ, కోడికూర పెట్టి ఇల్లు గుల్లు చేసింది. కోట్ల రూపాయలతో ఉడాయించింది.

కోయంబత్తూర్ లో వర్షిణి అనే యువతి, స్థానికంగా ఉంటున్న రాజేశ్వరి అనే మహిళతో పరిచయం పెంచుకుంది. రాజేశ్వరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వర్షిణి, తన వద్ద చాలామంది కస్టమర్లు ఉన్నారని, వేల ఎకరాల్ని నెల రోజుల్లోనే అమ్మించేస్తానని నమ్మబలికింది. దీంతో రాజేశ్వరికి ఆశపుట్టింది.

కొన్ని రోజులు మాటలు కలిపిన తర్వాత వర్షిణి ఇంటికొస్తానని చెప్పింది. తనతో పాటు ముగ్గురు కస్టమర్లను తీసుకొస్తున్నానని, వాళ్లు అడ్వాన్స్ ఇస్తారని నమ్మబలికింది. ఓ ముగ్గురు వ్యక్తుల్ని తీసుకొని రాజేశ్వరి ఇంటికెళ్లింది వర్షిణి. భోజనాల టైమ్ కావడంతో అంతా భోజనానికి కూర్చున్నారు.

భోజనం మధ్యలోనే రాజేశ్వరి కుప్పకూలింది. వెంటనే వర్షిణి రంగంలోకి దిగింది. ఇంట్లో ఉన్న రెండున్నర కోట్ల రూపాయల డబ్బు, వంద తులాల బంగారంతో ఉడాయించింది. రాజేశ్వరికి మెళకువ వచ్చి చూస్తే ఇల్లు గుల్లయింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించింది.

ఇంటికి వస్తూనే కోడికూర తీసుకొచ్చింది వర్షిణి. ఆ కూరలో మత్తు మందు కలిపి, భోజనంలో రాజేశ్వరికి వడ్డించింది. వీళ్లు మాత్రం దాన్ని తినకుండా జాగ్రత్త పడ్డారు. అలా ఇల్లు మొత్తం దోచేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వాళ్లను అరుణ్ కుమార్, సురేంద్రన్, ప్రవీణ్ లుగా గుర్తించారు. అసలు సూత్రధారి వర్షిణి మాత్రం తప్పించుకుంది. ఆమె విదేశాలకు పారిపోయిందని చెబుతున్నారు ఈ ముగ్గురు.