అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న జగన్ సంకల్పానికి న్యాయస్థానం తీర్పు అండగా నిలిచినట్టైంది. ఇంతకాలం ప్రజారాజధానిగా అమరావతిని ఎల్లో మీడియా కీర్తిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాగానే, ఎలా మసిపూసి రాయాలో రామోజీరావు పత్రికకు దిక్కుతోచలేదు. దీంతో స్థానికేతరులకు రాజధానిలో ఇళ్లపట్టాలన్న ఇవ్వాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందంటూ అక్షర కన్నీరు పెట్టుకోవడం రామోజీ మీడియాకే చెల్లింది.
రాజధాని పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం జీఓ నంబర్ 45 ప్రభుత్వం జారీ చేసింది. సీఆర్‌డీఏ నుంచి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు 1134.58 ఎకరాల భూమిని కలెక్టర్లకు ఏపీ సర్కార్ బదిలీ చేసింది. మొత్తం పది లేఔట్లలో 48,379 మంది పేదలకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటు చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అయితే జీవో నంబర్ 45ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. జీవో నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పునకు సంబంధించి ఈనాడు రాసిన తీరు ఆ పత్రిక యజమాని మనోగతాన్ని ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
“రాజధాని అమరావతి ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించాలంటూ వేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది”… ఇలా రాసుకొచ్చింది ఈనాడు వెబ్ పత్రిక. ఈనాడు రాసిన ప్రకారం స్థానికేతరులెవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
ప్రధానంగా జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లాలోని 24,587 మంది లబ్ధిదారులకు ఐనవోలు, మందడం, కురగల్లు, నిడమర్రులోనూ, అలాగే గుంటూరు జిల్లాలోని 24,152 మంది లబ్ధిదారులకు మందడం, కృష్ణాయపాలెం, నవులురు, ఐనవోలు, నిడమర్రులో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పది లేఔట్లు కూడా సిద్ధం చేశారు.
ప్రజారాజధాని అమరావతి అని, అందరికీ అనుకూలమని, దీనికి రాష్ట్ర ప్రజల మద్దతు వుందని ఎల్లో గ్యాంగ్ ఊదరగొట్టే సంగతి తెలిసిందే. కానీ రాజధానికి చుట్టు పక్కల ప్రాంతాల పేదలు అమరావతిలో ఇంటి స్థలాలకు మాత్రం అర్హులు కాదంటూ వాదించడం వారికే చెల్లింది. పేదలకు అనుకూలంగా తీర్పు వచ్చినా ఓర్వలేని తనం ఈనాడు రాతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. రాజధానికి లబ్ధిదారులు స్థానికేతరులైతే, మరి అక్కడ కొన్న టీడీపీ నేతలు మాత్రం స్థానికులా? ఇదేనా ఎల్లో మీడియా చెప్పదలుచుకున్నదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రాజధాని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అడ్డా మాత్రమే అని, అక్కడ పేదలకు స్థానం లేదని మరోసారి ఈ తీర్పుపై విషపు రాతల ద్వారా ఎల్లో గ్యాంగ్ చెప్పకనే చెప్పింది.